‘రొమాన్స్‌లో శిక్షణ పొందాలి’ | Vijay Antony Thimiru Pudichavan Will Out For Diwali | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 10:02 AM | Last Updated on Sun, Oct 28 2018 10:02 AM

Vijay Antony Thimiru Pudichavan Will Out For Diwali - Sakshi

రొమాన్స్‌ చేయడంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానని సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని చెప్పారు. తన విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై ఈయన కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం ‘తిమిరు పుడిచ్చవన్‌’(తెలుగులో రోషగాడు). నటి నివేదా పేతురాజ్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గణేశా తెరకెక్కించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తిమిరు పుడిచ్చవన్‌ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 6న తెరపైకి రానుంది. శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్‌ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన హిజ్రా సింధుజా మాట్లాడుతూ తమిళ సినిమాలో ఒక హిజ్రాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం కల్పించిన విజయ్‌ఆంటోనికి, దర్శకుడు గణేశాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.

ఈ చిత్రంలో తాను తొలి హిజ్రా ఎస్‌ఐ ప్రీతిక పాత్రను పోషించానని చెప్పింది. అందరూ భయపడి టచ్‌ చేయని ఒక విషయాన్ని ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఈ చిత్రంలో చూపించారన్నారు. హిజ్రాల జీవితంలోనే తిమిరు పుడిచ్చవన్‌ ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని సింధుజా పేర్కొంది.

చిత్ర కథానాయకి నివేదా పేతురాజ్‌ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడే భయపెట్టారన్నారు. మోటార్‌బైక్‌ నడపాలి, చేపల బండి తొక్కాలి అంటూ భయపెట్టారని చెప్పారు. ఆయన చెప్పినట్లే మోటార్‌బైక్‌ నడపడం నేర్చుకుని.. చిత్రానికి తానే డబ్బింగ్‌ చెప్పుకున్నానని తెలిపారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు దర్శకుడు తనతో చాలా విషయాలు చేయించినట్లు తెలిసిందన్నారు. నటిగా తన కేరీర్‌లోనే తిమిరు పుడిచ్చవన్‌ ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని నివేదా పేతురాజ్‌ వ్యక్తం చేశారు.

చిత్ర నిర్మాత, కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఏక వృక్షం.. తోట అవ్వదు అన్నట్లు ఈ చిత్రంలో తన భాగం చాలా తక్కువేనని చెప్పారు. ఈ చిత్రం కోసం దర్శకుడు గణేశా ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఏ చిత్రానికైనా హీరో దర్శకుడేనని అన్నారు. తన గత రెండు చిత్రాలు వ్యాపార పరంగా బాగా రాలేదన్నారు. ఆర్థిక సమస్యల మధ్య ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు.

ఈ చిత్రంలో రొమాన్స్‌ సన్నివేశాలు ఉండవని, అందువల్ల హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌తో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యిందని చెప్పలేనని అన్నారు. ఈ చిత్రం తరువాత రొమాన్స్‌ చేయడంలో శిక్షణ తీసుకుని అలాంటి సన్నివేశాల్లో నటిస్తానని అన్నారు. ఇకపోతే చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో దర్శకుడు కోరిక మేరకు దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు విజయ్‌ఆంటోని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement