ఆయతనం అంటే రూపం. ఆయతనం అనే మాటకు ఆలయం, గర్భగృహం అనే పేరు కూడా శాస్త్రంలో ఉంది. ఆయతనం అనే పదంతో మనకు బాగా పరిచయమైన పదం పంచాయతనం. ఆదిశంకరులు షణ్మతాలను స్థాపించి, పంచాయతన పూజను ఆచరించమని ప్రబోధించారు. నేటికీ ఈ పంచాయతన పూజను ఆచరించే వారెందరో ఉన్నారు. శివుడు, నారాయణుడు, గణేశుడు, సూర్యుడు, దేవి. వీరైదుగురు పంచాయతన దేవతలు. వీరిలో ఎవరికి ఇష్టమైన దేవతను మధ్యలో ఉంచి పూజిస్తే అది ఆ దేవతా పంచాయతనం అవుతుంది. ఉదాహరణకు శివుణ్ణి మధ్యలో ఉంచి ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు, నైఋతిలో వినాయకుడు, వాయువ్యంలో దేవి ఉంటే అది శివపంచాయతనం. ఇలా ఈ దేవతలు స్థానమార్పులతో పూజింపబడతారు.ఇది ఆత్మార్థంగా ఎవరికి వారు ఇంటిలో చేసుకునే పూజ. ఇదే పద్ధతిని అవలంబిస్తూ నిర్మించిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వీటిలో గర్భగుడిలో బ్రహ్మస్థానం(మధ్య)లో.. ఆగ్నేయం మొదలైన నాలుగు మూలాల్లో ఆయా దేవతా విగ్రహాలు ఉంటాయి.
అందరికీ పరిచయం అయిన పంచాయతనాలు ప్రాసాదమండనం.. మరికొన్ని చోట్ల కనిపిస్తే.. హయశీర్షసంహిత, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణాలలో పంచాయతన దేవతలు విభిన్నంగా కనిపిస్తారు. బ్రహ్మాయతనం, చండాయతనం, రామపంచాయతనం, కృష్ణపంచాయతనం వంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన అన్నవరం విష్ణు పంచాయతన దేవాలయం. తమిళనాడు కంచి కామాక్షీదేవి ఆలయం దేవీపంచాయతన ఆలయం. ఒక ఆయతనం(గర్భగుడి) నిర్మిస్తే స్వర్గఫలం, మూడు ఆలయాలతో బ్రహ్మలోకప్రాప్తి, ఐదు ఆలయాలతో శివలోకం, ఎనిమిది ఆలయాలతో విష్ణులోకం, తొమ్మిది, పన్నెండు, పదహారు ఆలయాలను నిర్మిస్తే ఇహంలో సుఖం, పరంలో మోక్షం కలుగుతుందని కపింజల సంహిత చెప్పింది. ఇక్కడ ఆలయం అంటే గర్భగుడి అని అర్థం చేసుకోవాలి. సృష్టికి మూలమైన పంచభూతస్వరూపాలనుండి ఒక్కో అంశాన్ని తీసుకుని నిర్మించిన పంచాయతన దేవతల్నీ.. వారిని ప్రతిష్ఠించిన పంచాయతన దేవాలయాల్ని దర్శించడం..పూజించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment