
వింటే శివస్తోత్రం కంటే యాగంటి
తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం.
మానవ జీవితానికి ఊతం కోసం భక్తి.
ఉల్లాసం కోసం ప్రకృతి.
ఈ రెంటి అనుసంధానంగా భారతదేశమంతటా ఆలయాలు ఏర్పడ్డాయి.
ఉమతో కలిసి మహేశ్వరుడు కొలువైన యాగంటి తెలుగువారికి సొంతమైన ఆధ్యాత్మిక సంపద. ఎర్రమల సౌందర్యానికి ప్రతీక.
రోజు రోజుకూ పెరిగే బసవయ్య ఇక్కడి విశిష్టత.
జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం- యాగంటి.
తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమా మహేశ్వరులు వెలసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. అందుకే భృగు, అగస్త్య వంటి మహా రుషులు అక్కడ సంచరించారని అంటారు. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్తావన చేశారు. ఇక్కడి నంది విగ్రహం రోజురోజుకూ పెరిగి కలియుగాంతానికి రంకె వేస్తుందని కాలజ్ఞానం. అంటే కలియుగాంతంతో ముడిపడిన క్షేత్రం ఇది అని అర్థం చేసుకోవాలి.
నేకంటి... యాగంటి
యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. బ్రహ్మంగారి వల్ల విఖ్యాతమైన బనగానపల్లికి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరం. చుట్టూ అడవి... ఎర్రటి కొండలు... పచ్చటి పరిసరాలు... రణగొణులు లేని ఏకాంతం... స్వచ్ఛమెన కొండధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగించే క్షేత్రం. దీని ఉనికి పురాణ కాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు.
అగస్త్యుని ఆలయం
యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించాడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శైవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒక దానిలో శ్రీ వేంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటన వేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు.
హరిహరరాయల కాలం నాటి క్షేత్రం
ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది కచ్చితంగా తెలియకపోయినా హరిహరరాయలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది (ఇలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండ ధారతో నిండే ఈ కోనేరులో స్నానం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్జాత కొండ ధారతో వచ్చే నీటిని ‘అగస్త్య పుష్కరిణి’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు.
శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు
ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకనొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుంటే కాకాసుర డనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించినట్లు ప్రతీతి. ఆగ్రహించిన అగ స్త్య ముని ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కాన రావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా క్షేత్రం శనిప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఉమామహేశ్వరస్వామిని దర్శించి పూజించడం వల్ల తప్పక శనిదోషం తొలగిపోతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది.
ఉత్సవాలు- పూజలు:
ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు, కార్తికమాస సందర్భంగా నెల రోజులు మాసోత్సవాలు, సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారి అర్చన, అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, ఆకుపూజలు, కల్యాణం, అన్నాభిషేకం, దంపతుల పూజలు, ఆకాశదీప పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఉమాశంకరదీక్షిత శర్మ తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు పూజలను బట్టి ఆలయ అధికారులు నిర్ణయించిన టికెట్లను పొందాల్సి ఉంటుంది. - గుండం సర్వేశ్వరరెడ్డి సాక్షి, బనగానపల్లె, కర్నూలు జిల్లా.
దర్శన వేళలు: ప్రతిరోజు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది.
వసతి సౌకర్యాలు: ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర సేవాసదన్, బ్రహ్మణి రెసిడెన్సీ తదితర వసతి గృహాలు ఉన్నాయి. వారు గదుల సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. ఇంకా అన్నదాన సత్రాల్లో కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన, ఉమామహేశ్వర రెడ్ల, వేదగాయత్రి బ్రాహ్మణ, వాసవి ఆర్యవైశ్య సత్రాల ద్వారా నిత్యాన్నదాన భోజన సౌకర్యాలు ఉన్నాయి.
రవాణా సౌకర్యం: యాగంటి క్షేత్రం బనగానపల్లె నుంచి 13 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి బనగానపల్లె-76 కి.మీలు, అనంతపురం నుంచి బనగానపల్లె - 120 కి.మీ. నంద్యాల నుంచి బనగానపల్లె - 45 కి.మీ, హైదరాబాద్ నుంచి బనగానపల్లె - 228 కి.మీ, శ్రీశైలం నుంచి బనగానపల్లె - 223 కి. మీ. మహానంది నుంచి బనగానపల్లె - 60 కి.మీ
యాగంటి బసవయ్య
యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు.
మూడు ముఖ్యమైన గుహలు
ఈ క్షేత్రం చుట్టూ నిలువుగా చెక్కినట్టుగా కొండలు ఉంటాయి. వాటి లోపల గుహలు ఉంటాయి. ఆలయానికి కుడివైపున ఉన్న కొండలో మూడు ముఖ్యమైన గుహలు ఉన్నాయి. ఒక గుహను వేంకటేశ్వర గుహ అంటారు. ఇందులో వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాయి. బొటన వేలు భగ్నమైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తిరుమల వేంక టేశ్వరుని విగ్రహంతో పోల్చితే ఈ విగ్రహం కొంచెం భిన్నంగా ఉంటుంది. మరో గుహను అగస్త్య గుహ అంటారు. ఇందులో పూజ లందుకుంటున్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠిం చాడని నమ్మకం. మూడో గుహను బ్రహ్మంగారి గుహ అంటారు. పశువుల కాపరిగా ఉండగా బ్రహ్మంగారు ఇక్కడికి పశువులతో వచ్చి ఈ గుహలోనే కాలజ్ఞానంలో కొంతభాగం రాశారని నమ్మకం. తన శిష్యురాలైన గరివిరెడ్డి అచ్చమ్మకు ఇక్కడే జ్ఞానో దయం చేశారట. ఇంకా భక్తులకు అందుబాటులో లేని గుహలలో మహాత్ములు నేటికీ ధ్యానం చేస్తుంటారంటారు.