పిల్లలు ప్రకృతి ప్రేమికులు ఎలా!
చిన్నతనంలో ఇంటి బయట ఆడుకున్న 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. తాము ప్రకృతిని అమితంగా ఇష్టపడతామని, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని వారు తెలిపారు. ఈ తరహాలో అలోచించే పిల్లలు చిన్నప్పుడు వివిధ పర్యావరణ సంబంధిత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అందుకే వారు ప్రకృతిపై ఇష్టాన్ని పెంపొందించుకున్నారని వర్సిటీ ప్రొఫెసర్ బూన్ విశ్లేషించారు. బయట ఆడుకునే సమయంలో పిల్లలు ప్రకృతిని ఆస్వాదిస్తారన్నారు.
అందుకే పెద్ద అయిన తరువాత వారికి ప్రకృతిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ కేథరీన్ వివరించారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లైనా అవుట్ డోర్ గేమ్స్ (బయట ఆడుకునే క్రీడలు) ఆడితే పిల్లల్లో ప్రకృతిపై ప్రేమ, గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఈ అధ్యయన వివరాలను ఆస్ట్రేలియాకి చెందిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.