‘‘అమ్మా! ఆకుకూరలు ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?’’ ‘‘నాన్నా! గడ్డి పచ్చగా ఉంటుంది ఎందుకు?’’ ‘‘నానమ్మా! చంద్రుడు గుండ్రంగా ఉంటాడెందుకు?’’
బాల్యం అంటేనే సందేహాల సమాహారం. బుర్రకో సందేహం. ఆ సందేహాన్ని తీర్చేలోపు మరో సందేహం... ప్రశ్నోత్తర పరంపర సీరియల్‌గా సాగుతూనే ఉంటుంది. మెదడు వికసించే దశలో ఉదయించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొంచెం కష్టమే. పిల్లల ప్రతి ప్రశ్నకూ సమాధానాలుంటాయి. కానీ సమాధానాలన్నీ తెలిసిన తల్లిదండ్రులు దాదాపుగా ఉండరు. తమకు తెలిసిన సబ్జెక్టులో ప్రశ్న అయితే ఠక్కున వివరించగలుగుతారు. తెలియని విషయమైతే గూగుల్‌లో సెర్చ్ చేసి చెప్పగలుగుతున్నారు ఈ తరం పేరెంట్స్ కొందరు. పిల్లల పెట్టే రొటీన్ పరీక్షలకు తోడు ఈ ఏడాది కరోనా కొత్త పరీక్ష పెట్టింది. కరోనా కోరల నుంచి పిల్లలను రక్షించుకోవడానికి కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకుంటున్నారు.
టీవీ పెడితే కరోనా వార్తలే. సోషల్ మీడియాలోనూ కరోనా కలకలమే. కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్, కరోనా నెగిటివ్ కేసులు, కరోనా మరణాల వార్తల మధ్య పిల్లల మెదళ్లు కొత్తగా ఆలోచించడం మానేశాయి. ఎంతసేపూ ఏదో తెలియని ఆందోళన. తల్లిదండ్రుల భయం తెలుస్తుంటుంది. పిల్లల పట్ల అమ్మానాన్నలు తీసుకుంటున్న శ్రద్ధ... పిల్లలకు భయం తీవ్రతను అర్థం చేయిస్తుంటుంది. విజ్ఞానంతో వికసించాల్సిన చిన్న మెదళ్లలో ఆందోళన పురుడు పోసుకోవడం ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మొదలైంది. ఈ పరిస్థితిని గమనించిన కరిష్మా కౌశిక్, స్నేహాల్ కాదమ్ అనే సైంటిస్టులు పిల్లల కోసం మార్చిలో ‘టాక్ టు ఎ సెంటిస్ట్’ పేరుతో ఉచిత ఇంటరాక్టివ్ వెబినార్ ప్రయోగం చేశారు. అది విజయవంతమైంది. పిల్లలు సోమవారం సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
టాక్ టు ఎ సైంటిస్ట్ ప్రోగ్రామ్
కరిష్మా కౌశిక్, స్నేహాల్ కాదమ్ ఇద్దరూ పుణే యూనివర్సిటీలో సైంటిస్టులు. తన పదేళ్ల కొడుకు అడిగే ప్రశ్నల నుంచి వచ్చిన ఆలోచనే ‘టాక్ టు ఎ సైంటిస్ట్’ అని చెప్పింది కరిష్మ. ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు పిల్లలను దృష్టిలో పెట్టుకుని విషయాల రూపకల్పన చేసినట్లు చెప్పిందామె. ప్రతి సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు గంట సేపు సాగే టాక్ టు ఎ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పట్ల పిల్లలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పింది స్నేహాల్. ఈ ఇద్దరు సైంటిస్టులు స్వయంగా కొన్ని విషయాలను వివరిస్తారు. జూమ్‌లో సాగే ఈ ‘టాక్ టు ఎ సైంటిస్ట్’ కార్యక్రమానికి ఇతర సైంటిస్టులను అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. క్లాసు పుస్తకంలో సైన్సు పాఠం చదవాలంటే ముఖం చిట్లించుకునే పిల్లలు కూడా ఈ వెబినార్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సాలెపురుగు గూడు ఎలా కట్టుకుంటుందనే ఆసక్తి లేనిదెవరికి? పిల్లలందరూ కళ్లింత చేసుకుని చూశారు. మరోవారం కణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్‌ను కూడా ఆసక్తిగా ఆస్వాదించారు. గెస్ట్ సైంటిస్ట్ ఒకరు అరటికాయ నుంచి డిఎన్‌ఎను సేకరించడం ఎలాగో చూపించారు. ఇందులో తెలుసుకున్నవన్నీ పిల్లల మెదళ్ల మీద అలా నాటుకుపోతాయని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవేవీ ఆ చిన్న మెదళ్లకు పరీక్షలు పెట్టవు. మార్కుల ఒత్తిడి ఉండదు. పాఠం అర్థం చేసుకుని అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వాలని, జవాబు చెప్పలేకపోతే టీచర్ ముఖం అప్రసన్నంగా మారుతుందేమోననే భయం కూడా ఉండదు. పిల్లలకు అంతకంటే పెద్ద సాంత్వన మరేం ఉంటుంది? ఈ వెబినార్‌లో పిల్లలు సందేహాలను ధైర్యంగా అడుగుతున్నారు. తమకు తెలిసిన విషయాలను సంతోషంగా పంచుకుంటున్నారు. అందుకే సోమవారం సాయంత్రం కోసం అంతటి ఎదురు చూపు.
Comments
Please login to add a commentAdd a comment