university of british columbia
-
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
వాషింగ్టన్: భూమిపై నుంచి అంతరిక్షానికి రాకెట్ ప్రయోగాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రతి సంవత్సరం ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. అంతరిక్షాన్ని శోధించడానికి పరికరాలను పంపడమూ ఎక్కువైంది. ఈ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. మరి గగనవీధిలోకి పంపించిన ఉపగ్రహాలు, పరికరాలు ఏమవుతున్నాయి. పని కాలం ముగిసిన తర్వాత అవి అక్కడే పేలిపోయి, వ్యర్థాలుగా మారుతున్నాయి. కొన్ని పుడమి మీదకు ప్రచండ వేగంతో దూసుకొస్తుంటాయి. గ్రహ శకలాలూ భూమిపై పడుతుంటాయి. అంతరిక్ష చెత్తగా పిలిచే ఇలాంటి వ్యర్థాల కారణంగా రానున్న రోజుల్లో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాల శకలాలు, సంబంధిత అంతరిక్ష చెత్త భూమిపై పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనలు సంభవించినట్లు ఇప్పటికైతే దాఖలాలు లేవు. కానీ, వేలాది సంవత్సరాల క్రితం గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే రాక్షస బల్లులు అంతరించిపోయాయని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతరిక్ష చెత్త వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది నమ్మశక్యంగా లేనప్పటికీ మరో పదేళ్లలో ఈ ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఫలితాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. దక్షిణ అక్షాంశంలో ప్రమాదం అధికం పనిచేయని ఉపగ్రహాలు సైతం వాటి కక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వాటిలోని ఇంధనం, బ్యాటరీల్లో పేలుడు ఘటనలతో ముక్కలు చెక్కలవుతాయి. అతి సూక్ష్మ శకలాలుగా విడిపోతాయి. వాటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తిని లోనై మనవైపు దూసుకొస్తాయి. భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఊహించలేనంత నష్టం వాటిల్లుతుంది. సహజ అంతరిక్ష చెత్తగా వ్యవహరించే గ్రహశకలాలు అరుదుగా గానీ భూమివైపునకు దూసుకురావు. సమస్యంతా కృత్రిమ అంతరిక్ష చెత్తతోనే. అంటే ఉపగ్రహాలు, రాకెట్లు. వీటి ముప్పును అంచనా వేయడానికి అధునాతన గణిత శాస్త్ర విధానాలను ఉపయోగించారు. ఉత్తర ఆకాంశంతో పోలిస్తే దక్షిణ అక్షాంశంలోనే అంతరిక్ష చెత్త ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. న్యూయార్క్, బీజింగ్, మాస్కోలతో పోలిస్తే జకార్తా, ఢాకా, లాగోస్‌లో మూడు రెట్లు ఎక్కువ ప్రాణాపాయమని అధ్యయనంలో తేలింది. రాకెట్లు, ఉపగ్రహాల నుంచి ఊడిపడే శకలం భూమిపై పది చదరపు మీటర్ల మేర పరిధిలో ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఒకరు లేదా ఇద్దరు మరణించేందుకు 10 శాతం ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష చెత్త భూమిపైకి రాకుండా నిరోధించవచ్చని అంటున్నారు. అది చాలా ఖరీదైన వ్యవహారమని అభిప్రాయపడుతున్నారు. -
స్మార్ట్‌ఫోన్.. ఆనందానికి హానికరం!
టొరంటో: ‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. స్నేహితులను బృందాలుగా చేసి ఒకే టేబుల్‌పై భోజనం వడ్డించి వారి ఫోన్లను చేతికిచ్చారు. భోజనం అనంతరం వారికి కలిగిన వివిధ అనుభవాలను రికార్డు చేసి విశ్లేషించారు. కాగా, స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పరధ్యానంలో ఉండటం, ఆందోళన చెందటం వంటి ఆనందం తగ్గించే భావోద్వేగాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. రెండో అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు తమ అనుభవాలను రాయాలని ఓ ప్రశ్నావళి ఇచ్చి సర్వే చేపట్టారు. తర్వాత వారి సమాధానాలను పరిశీలించగా..స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ టు ఫేస్ చాట్ వల్ల ఆనందం కలగకపోవడమే కాక, దానిపై విరక్తి పెరుగుతున్నట్లు గుర్తించారు. -
పిల్లలు ప్రకృతి ప్రేమికులు ఎలా!
టోరంటో: ఇంటి వెలుపల క్రీడలు ఆడే పిల్లలకు ప్రకృతిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఓక్నాగన్కి చెందిన ప్రొఫెసర్లు జరిపిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. చిన్నతనంలో ఇంటి బయట ఆడుకున్న 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. తాము ప్రకృతిని అమితంగా ఇష్టపడతామని, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని వారు తెలిపారు. ఈ తరహాలో అలోచించే పిల్లలు చిన్నప్పుడు వివిధ పర్యావరణ సంబంధిత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అందుకే వారు ప్రకృతిపై ఇష్టాన్ని పెంపొందించుకున్నారని వర్సిటీ ప్రొఫెసర్ బూన్ విశ్లేషించారు. బయట ఆడుకునే సమయంలో పిల్లలు ప్రకృతిని ఆస్వాదిస్తారన్నారు. అందుకే పెద్ద అయిన తరువాత వారికి ప్రకృతిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ కేథరీన్ వివరించారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లైనా అవుట్ డోర్ గేమ్స్ (బయట ఆడుకునే క్రీడలు) ఆడితే పిల్లల్లో ప్రకృతిపై ప్రేమ, గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఈ అధ్యయన వివరాలను ఆస్ట్రేలియాకి చెందిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.