చెంగు చెంగున
అమ్మాయి పరికిణీ ఓణీ వేసుకుని ఇల్లంతా పరుగులు తీస్తుంటే...
జింకపిల్లలా చెంగుచెంగున గెంతులేసినట్లే అనిపిస్తుంది.
లేడికి లేచిందే పరుగు అంటారు.
అవునవును.
సంక్రాంతికి ఎంగ్ లేడీస్ హాఫ్ శారీ కడితే...
ఫుల్లుగా చెంగులే చెంగులు!
తమ్ముళ్లు, చెల్లాయిలు ఆ చెంగులు పట్టుకుని
పరుగెడుతుంటే పండగ కళ వచ్చేసినట్టే.
► అల్లరి ఆటల ఆనందంలో హరివిల్లుల సోయగం అమ్మాయి లంగాఓణీ రూపం.
► నింగిని వదిలి నేలకు దిగిన దేవకన్యల పరవశం లంగాఓణీ ముస్తాబు సొంతం.
►గడపకు పసుపు– కుంకుమలా, గుమ్మానికి తోరణంలా పండగ సింగారమంతా లంగాఓణీయే చుట్టేసుకుంటుంది. చూపులను కట్టేసుకుంటుంది.
► పెద్దంచు పట్టు పరికిణీ.. అంచు రంగులో ఓణీ ధరిస్తే పరవశాల ప్రకృతి సిగలో ముద్దబంతిలా వెలిగిపోవాల్సిందే!
►ఆకాశంలో పతంగులు రంగవల్లులు అల్లే వేళ అమ్మాయి అద్దాల లంగా ఓణీలో ప్రత్యక్షమైతే పుడమిన హరివిల్లు పూచినట్టే!
►లంగాఓణీ హంగులు అమ్మాయి నవ్వులతో పోటీపడితే పండగ సంబరాలు సింగారపు కళను అద్దుకున్నట్టే.
► నింగిన చందమామ నట్టింటికి వచ్చిందంటే అది లంగాఓణీ ధరించిన అమ్మాయే అయ్యుంటుంది. రెండు కళ్లు సరిపోనంత వెన్నెల పట్టపగలే కురిపించేస్తుంది.