Oni skirt
-
చెంగు చెంగున
అమ్మాయి పరికిణీ ఓణీ వేసుకుని ఇల్లంతా పరుగులు తీస్తుంటే... జింకపిల్లలా చెంగుచెంగున గెంతులేసినట్లే అనిపిస్తుంది. లేడికి లేచిందే పరుగు అంటారు. అవునవును. సంక్రాంతికి ఎంగ్ లేడీస్ హాఫ్ శారీ కడితే... ఫుల్లుగా చెంగులే చెంగులు! తమ్ముళ్లు, చెల్లాయిలు ఆ చెంగులు పట్టుకుని పరుగెడుతుంటే పండగ కళ వచ్చేసినట్టే. ► అల్లరి ఆటల ఆనందంలో హరివిల్లుల సోయగం అమ్మాయి లంగాఓణీ రూపం. ► నింగిని వదిలి నేలకు దిగిన దేవకన్యల పరవశం లంగాఓణీ ముస్తాబు సొంతం. ►గడపకు పసుపు– కుంకుమలా, గుమ్మానికి తోరణంలా పండగ సింగారమంతా లంగాఓణీయే చుట్టేసుకుంటుంది. చూపులను కట్టేసుకుంటుంది. ► పెద్దంచు పట్టు పరికిణీ.. అంచు రంగులో ఓణీ ధరిస్తే పరవశాల ప్రకృతి సిగలో ముద్దబంతిలా వెలిగిపోవాల్సిందే! ►ఆకాశంలో పతంగులు రంగవల్లులు అల్లే వేళ అమ్మాయి అద్దాల లంగా ఓణీలో ప్రత్యక్షమైతే పుడమిన హరివిల్లు పూచినట్టే! ►లంగాఓణీ హంగులు అమ్మాయి నవ్వులతో పోటీపడితే పండగ సంబరాలు సింగారపు కళను అద్దుకున్నట్టే. ► నింగిన చందమామ నట్టింటికి వచ్చిందంటే అది లంగాఓణీ ధరించిన అమ్మాయే అయ్యుంటుంది. రెండు కళ్లు సరిపోనంత వెన్నెల పట్టపగలే కురిపించేస్తుంది. -
సంప్రదాయ స్కర్ట్
ఫ్యాషన్ అమ్మాయిలు ఒకప్పుడు లంగా జాకెట్టు వేసుకునేవారు. పెద్దయ్యాక లంగా ఓణీలతో అలరించేవారు. ఆ తర్వాత దాన్నే కాస్త మార్చి గాగ్రా చోళీతోఅబ్బురపరిచారు. సౌకర్యంగా ఉంటాయని షల్వార్ కమీజ్ల్లోకి మారారు. దీని నుంచే అనార్కలీని రూపుకట్టారు. వీటినే మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు కదా! అని పోటీపడ్డట్టున్నారు. ఆ కుర్తీ (కమీజ్)ని, ఈ స్కర్ట్ (లంగా లేదా లెహెంగా)ని కలిపి ఇలా మగువలు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. దీన్నే ఇప్పుడంతా కుర్తీ స్కర్ట్ స్టైల్ అంటున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ తారలు కూడా వీటిని ధరించి ఈ స్టైల్ పట్ల మరింత క్రేజ్ పెంచుతున్నారు. కుచ్చులు కుచ్చులుగా విప్పార్చుకున్న లెహంగా మీదకు ఒక మంచి కాంబినేషన్‌గా పొడవాటి కుర్తీని ధరిస్తే... స్టైల్ కాస్తా సంప్రదాయమనిపిస్తుంది. పొట్టి కుర్తీ ధరిస్తే ఇంకాస్త ఆధునికం అని మార్కులు వేయించేస్తుంది. స్కర్ట్స్.. కట్స్... పలాజో ప్యాంట్స్ హవా కొన్నాళ్లుగా ఊపు మీదుంది. ఈ ప్యాంట్ వదులుగా, ప్లెయిన్‌గా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో డిజైనర్లు వీటికి కుచ్చులు జతచేశారు. దీంతో ఎత్నిక్ డిజైన్స్‌లో పలాజో స్కర్ట్ పెద్ద హిట్ అయ్యింది. పలాజో స్కర్ట్ స్టైల్ విభిన్నరకాల కట్స్‌తో వయసు తేడా లేకుండా అందరి హృదయాలను వెర్రెత్తిస్తోంది. మధ్యవయసు స్త్రీలు కూడా ఈ స్టైల్‌తో మెరిసిపోతూ వయసును దాచేస్తున్నారు. ఎదుటివారి మదిని దోచేస్తున్నారు. స్కర్ట్ ఎంపిక ప్రధానం... మనీష్ మల్హోత్రా, సవ్యసాచి.. వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైన ర్లు ఇస్తున్న కుర్తీ స్కర్ట్ స్టైల్ కిటుకులు ఇవి... బెనారస్, పట్టు, కాటన్...ఏ ఫ్యాబ్రిక్ అయినా మంచి ఫాల్ ఉన్న మెటీరియల్‌ను ఎంచుకోండి.పొడవాటి కుర్తీ ధరించినప్పుడు మీ లుక్ కాస్త సున్నితంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి ఓ ప్రింటెడ్ పలాజో స్కర్ట్ లేదా స్కర్ట్‌ను బాటమ్‌గా జత చేయండి. స్కర్ట్ మీదకు స్ట్రెయిట్ కట్ కుర్తీని వేసుకుంటే మోడ్రన్‌గా అనిపిస్తారు. అదే అనార్కలీ కుర్తీ వేసుకుంటే ట్రెడిషనల్‌గా కనిపిస్తారు.స్కర్ట్, కుర్తీ సూట్ ధరించినప్పుడు ఒక క్రష్డ్ స్టోల్ వేసుకుంటే మీ లుక్స్‌కి ప్రశంసలు రాకుండా ఉండనే ఉండవు. కుర్తీ డిజైన్, ఎంచుకున్న ఫ్యాబ్రిక్‌ను బట్టి మీ లుక్స్ ఆధారపడి ఉంటాయనేది మర్చిపోవచ్చు.వేడుకలలో ఈ తరహా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు లెహంగా గ్రాండ్‌గా ఉండేలా చూసుకోండి. కుర్తీ మీద ఎంబ్రాయిడరీ, బీడ్స్ డిజైన్ ఉండేలా జాగ్రత్తపడండి. క్యాజువల్‌గా ధరించాలనుకుంటే కాటన్స్తోనే ఇంట్లోనూ కంఫర్ట్‌గా వెలిగిపోవచ్చు. స్కర్ట్స్ మీదకు పొట్టి, పొడవు కుర్తీలూ నప్పుతాయి.పలాజో స్కర్ట్స్‌లో పాలియెస్టర్, లినెన్, కాటన్... వేడి వాతావరణంలోనూ సౌకర్యంగా ఉంటాయి. అలంకరణ... మీరు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా ఈ డ్రెస్ ధరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. యాక్సెసరీస్ పెద్దగా అవసరం లేదు. హెయిర్ స్టైల్ వదులుగా వదిలేయవచ్చు. బారుగా జడఅల్లనూ వచ్చు. - ఎన్.ఆర్. -
అతికేస్తే.. కొత్తగా!
డ్రెస్ కుట్టడానికి ముందు క్లాత్‌ను కత్తెర్తో తగిన కొలతలలో కత్తిరించి, కుడతాం. అలా కుట్టిన డ్రెస్‌ను ఎప్పుడూ ఒకే విధంగా ధరించాలి. ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను మరోసారి ధరించాలంటే నేటి రోజుల్లో అమ్మాయిలు అంతగా ఇష్టపడటం లేదు. ప్రతిసారీ కొత్త డ్రెస్ కావాలంటే కష్టం. అందుకే ఒకే డ్రెస్‌ను రెండు, మూడు విధాలుగా మార్చుకొని ‘కొత్త డ్రెస్’గా రూపొందించుకోవచ్చు. ఇందుకు కావాల్సింది కాస్త సృజన, ఇంకాస్త నేర్పు. ఇక్కడ మీ సౌలభ్యం కోసం ఒక డ్రెస్‌ను రెండు విధాలుగా ఎలా మార్చుకోవచ్చో చూపిస్తున్నాం. లంగా ఓణీ అనార్కలీగా... నిమ్మ పండు రంగు లెహంగా, గులాబీ రంగు బ్లౌజ్, గోధుమ రంగు నెటెడ్ ఓణీతో తీర్చిదిద్దిన డ్రెస్ ఇది. లంగా ఓణీని కొన్ని సార్లు ధరించాక మళ్లీ అదే డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడుకలో మరో కొత్త డ్రెస్ ఉంటే బాగుండు అనుకునేవారు లంగా ఓణీనే అనార్కలీగా మార్చేసుకోవచ్చు.బ్లౌజ్ భాగాన్ని, స్కర్ట్ భాగానికి జత చేసి కుట్టాలి. ఓణీని దుపట్టాలా వేసుకోవాలి. ఈ డ్రెస్‌కు బాటమ్‌గా లెగ్గింగ్ లేదా చుడీ వాడితే సరిపోతుంది.ఇప్పుడు అనార్కలీ డ్రెస్సులను మడమల వరకు ధరించడం ట్రెండ్‌గా ఉంది. కాబట్టి లెహంగాలను పొడవాటి అనార్కలీ గౌన్లుగా రూపొందించుకోవచ్చు. నోట్: అనార్కలీని లంగా ఓణీలా కూడా మార్చేసుకోవచ్చు. పొడవాటి అనార్కలీ టాప్‌ను బ్లౌజ్ భాగంలో విడదీసి, మళ్లీ జాగ్రత్తగా కుట్టేయాలి.ఈ తరహా డ్రెస్‌ల రూపకల్పనకు రెగ్యులర్‌గా వాడే మెటీరియల్స్ కాకుండా షిఫాన్, జార్జెట్, నెట్ ఫ్యాబ్రిక్ వాడితే డ్రెస్‌ల అందం చూడచక్కగా ఉంటుంది. స్వరోస్కి, కుందన్స్, లేసులతో అంచుభాగాలను తీర్చిదిద్ది ఎక్కువ లేయర్స్‌గా కూడా అనార్కలీ, లంగాఓణీలను నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.