అతికేస్తే.. కొత్తగా!
డ్రెస్ కుట్టడానికి ముందు క్లాత్‌ను కత్తెర్‌తో తగిన కొలతలలో కత్తిరించి, కుడతాం. అలా కుట్టిన డ్రెస్‌ను ఎప్పుడూ ఒకే విధంగా ధరించాలి. ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను మరోసారి ధరించాలంటే నేటి రోజుల్లో అమ్మాయిలు అంతగా ఇష్టపడటం లేదు. ప్రతిసారీ కొత్త డ్రెస్ కావాలంటే కష్టం. అందుకే ఒకే డ్రెస్‌ను రెండు, మూడు విధాలుగా మార్చుకొని ‘కొత్త డ్రెస్’గా రూపొందించుకోవచ్చు. ఇందుకు కావాల్సింది కాస్త సృజన, ఇంకాస్త నేర్పు. ఇక్కడ మీ సౌలభ్యం కోసం ఒక డ్రెస్‌ను రెండు విధాలుగా ఎలా మార్చుకోవచ్చో చూపిస్తున్నాం.
లంగా ఓణీ అనార్కలీగా...
నిమ్మ పండు రంగు లెహంగా, గులాబీ రంగు బ్లౌజ్, గోధుమ రంగు నెటెడ్ ఓణీతో తీర్చిదిద్దిన డ్రెస్ ఇది. లంగా ఓణీని కొన్ని సార్లు ధరించాక మళ్లీ అదే డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడుకలో మరో కొత్త డ్రెస్ ఉంటే బాగుండు అనుకునేవారు లంగా ఓణీనే అనార్కలీగా మార్చేసుకోవచ్చు.బ్లౌజ్ భాగాన్ని, స్కర్ట్ భాగానికి జత చేసి కుట్టాలి. ఓణీని దుపట్టాలా వేసుకోవాలి. ఈ డ్రెస్‌కు బాటమ్‌గా లెగ్గింగ్ లేదా చుడీ వాడితే సరిపోతుంది.ఇప్పుడు అనార్కలీ డ్రెస్సులను మడమల వరకు ధరించడం ట్రెండ్‌గా ఉంది. కాబట్టి లెహంగాలను పొడవాటి అనార్కలీ గౌన్‌లుగా రూపొందించుకోవచ్చు.
నోట్: అనార్కలీని లంగా ఓణీలా కూడా మార్చేసుకోవచ్చు. పొడవాటి అనార్కలీ టాప్‌ను బ్లౌజ్ భాగంలో విడదీసి, మళ్లీ జాగ్రత్తగా కుట్టేయాలి.ఈ తరహా డ్రెస్‌ల రూపకల్పనకు రెగ్యులర్‌గా వాడే మెటీరియల్స్ కాకుండా షిఫాన్, జార్జెట్, నెట్ ఫ్యాబ్రిక్ వాడితే డ్రెస్‌ల అందం చూడచక్కగా ఉంటుంది. స్వరోస్కి, కుందన్స్, లేసులతో అంచుభాగాలను తీర్చిదిద్ది ఎక్కువ లేయర్స్‌గా కూడా అనార్కలీ, లంగాఓణీలను నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.