గండ భేరుండం అంటే చాలా పెద్దది.. గొప్పది అని అర్థం.పట్టు, డిజైనర్ చీరల మీద.. ఆభరణాల మీదగండభేరుండ చిహ్నం గొప్ప లుక్‌ని, గ్రాండ్‌నెస్‌ని తీసుకొస్తుంది.రాచరికపు హంగు ఈ చిహ్నం సొంతం.
అందుకే ఇప్పుడు ఫ్యాషన్ ఆకాశంలో గండభేరుండం ఎగురుతోంది.కొన్నిసార్లు జీవితంలో అంతగా పట్టింపులేని, పట్టించుకోని అంశాల వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. వాటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో కళాకారుల సృష్టి వెనక దాగున్న ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఆ కోవకి చెందినదే గండభేరుండ. వస్త్రాల మీద, ఆభరణాల పైనా గ్రాండ్‌గా కొలువు దీరుతోంది.
ఒక శరీరం రెండుతలలు
గండభేరుండ అనేది రెండుతలల పక్షి. ఈ పక్షి ప్రాచీనకాలంలో ఉన్నట్లు రుజువులు లేవు. ఇదొక పౌరాణిక గాధ అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం గండభేరుండకు సంబంధించి కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో– రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ మృగ రూపం ధరించాడని, దానిని ఎదిరించేందుకు నరసింహస్వామి అయిన విష్ణువు రెండుతలలతో, విశాలమైన రెక్కలతో, పదునైన కోరలతో, నల్లని రూపంతో గండభేరుండంలా అవతరించాడని.. అది గరుత్మంతునికన్నా బలమైనదని కథనాలు ఉన్నాయి. కర్నాటకలోని బేలూర్‌లో గల చెన్నకేశవాలయంలో గల గండభేరుండ శిల్పాకృతి ప్రకృతిలోని జీవులన్నింటిలో గండభేరుండం బలమైనదని చాటుతుంది.
గ్రాండ్‌గా ఆవిష్కరించారు
దక్షిణభారతదేశంలో గండభేరుండకు గల ఘనమైన ఖ్యాతి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. దేవాలయాల మీద, చారిత్రక కట్టడాల మీద రాచరికానికి హంగుగా ఉన్న భేరుండాన్ని పట్టుదారాలతో చీరల మీద చిత్రించారు నేతకారులు. అపారమైన దైవశక్తికి ప్రతీకగా ఉండే గండభేరుండం డిజైన్‌తో పల్లూ మొత్తం నింపేశారు. మోటిఫ్స్‌గా చిన్న చిన్న భేరుండ బొమ్మలను తీసుకున్నారు.
ఆభరణాలలో భేరుండం
స్వర్ణకారుల ఆభరణాలలోనూ గండభేరుండం అందంగా అమరింది. ముత్యాలు, రత్నాలతో ముచ్చటైన రూపం సంతరించుకుంది.
ఘన చరిత గల గండభేరుండ డిజైన్ ఉన్న చీర ఒక్కటైనా∙వార్డ్రోబ్‌లో ఉండాలని, తమ ఆభరణాలలో చిన్న రూపుగా అయినా కావాలని కోరుకుంటున్నారు. ప్రాచీన కళలోని గ్రాండ్‌నెస్‌ను ఇష్టపడుతున్నారు కనుకే గండభేరుండ గ్రాండ్‌గా వెలిగిపోతోంది.
రాచరికపు హంగు
కర్నాటకలోని వొడయార్ రాజుల పాలనలో తమ రాజ్యశక్తికి గండభేరుండ చిహ్నాన్ని వాడేవారు. స్వాతంత్య్రానంతరం కర్నాటక ప్రభుత్వం గండభేరుండ పక్షిని తమ రాష్ట్ర అధికారిక చిహ్నంగా తీసుకుంది. మైసూర్‌ప్యాలెస్ ద్వారం మీదా ఈ పక్షి రూపం చూడచ్చు. తెలుగునాట కాకతీయుల చారిత్రక కట్టడాల మీద, రామేశ్వరం, బృహదీశ్వరం వంటి ప్రాచీన దేవాలయాల మీదా ఈ పక్షి రూపాన్ని తిలకించవచ్చు. విజయనగర సామ్రాజ్యాధీశులు 500 ఏళ్లక్రితమే భేరండ చిహ్నాన్ని తమ అధికారక నాణేల మీద వాడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
- నిర్వహణ: ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment