
పచ్చని తోటలు తోడుంటే ఆరోగ్యం మనవెంటే అంటోంది తాజా అథ్యయనం..
లండన్ : పచ్చని తోటల్లో ఆహ్లాదకర వాతావరణంలో విహరిస్తే మానసిక ఉల్లాసమే కాదు మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు సహా చివరికి ఒత్తిడీ దరిచేరదని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. కలివిడిగా ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యాలపై పెనుప్రభావం చూపుతుందని ఈ భారీ సర్వేలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అథ్యయనం నేపథ్యంలో పచ్చని వాతావరణంలో గడపాలని రోగులకు ఇక వైద్యులు సూచించే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్‌తో పాటు దాదాపు 20 దేశాలకు చెందిన కోట్లాది మందిపై జరిపిన పరిశోధన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిగ్గుతేల్చారు.
ప్రకృతి సహజమైన పచ్చిక బయళ్లలో సమయం గడపడం ద్వారా అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. ప్రకృతి ఒడిలోఅధిక సమయం వెచ్చించడం ద్వారా టైప్ టూ డయాబెటిస్, గుండె జబ్బులు, అకాల మరణం ముప్పును నిరోధించవచ్చని, నిద్ర లేమిని నివారించవచ్చని అథ్యయన రచయిత కోమి బెన్నెట్ పేర్కొన్నారు.
పార్కులు, ఉద్యానవనాలు, పచ్చికబయళ్లతో కూడిన సహజమైన ప్రకృతితో సహవాసం హృదయ స్పందనలను సమన్వయం చేయడంతో పాటు ఒత్తిడినీ దూరం చేస్తుందన్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరే వారు సహజంగానే శారీరక శ్రమతో పాటు నలుగురితో కలివిడిగా ఉంటారని ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.
సహజసిద్ధమైన వాతావరణంలో ఉండే వైవిధ్య బ్యాక్టీరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వాపులను నిరోధిస్తాయన్నారు. ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో తాజా అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.