పల్లె–నగరం మధ్య తేడాలు | Difference between Urban and Rural | Sakshi

పల్లె–నగరం మధ్య తేడాలు

Jan 23 2017 12:12 AM | Updated on Oct 20 2018 4:36 PM

అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం.

నగర గీతం
అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం.
పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి.
పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం.
పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు.
పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత.
పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు.
పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు.

నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది.

నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్‌.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్‌’ కవితల్లో ప్రతిఫలించాయి.
నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం.

నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు:
శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది.
విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది.
మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి.
సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి.
ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి.
నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు.
అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ  జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది.
పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి.

మాదిరి ప్రశ్నలు

1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి?         (6 మార్కులు)
2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి?      (3 మార్కులు)
3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి.         
3 మార్కులు)
4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్‌ ఏం చెప్పదలచుకున్నారు?
(6 మార్కులు)
5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి?        (3 మార్కులు)
6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి.    (6 మార్కులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement