సహజ ఎరువుపై శ్రద్ధలేదు!
అన్ని జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతున్న కంపోస్టు పిట్స్‌ల నిర్మాణం
♦ మంజూరైన కంపోస్టు పిట్స్ 1,68,725
♦ నిర్మాణంలో ఉన్నవి 19,631
♦ నిర్మాణాలు పూర్తయినవి5,669
♦ ప్రారంభానికి నోచుకోనివి1,43,425
పశువుల పేడ, వ్యర్థా ల కోసం నిర్మించు కునే కంపోస్టు పిట్‌ల కోసం ఒక్కో రైతుకు రూ.4,040 చొప్పున చెల్లిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా నిర్మించే వర్మీ/నాడెప్ కంపోస్టు పిట్స్‌ల కోసం రూ.12 వేలు చెల్లిస్తున్నారు. వీటిని తమ ఇంటి ఆవరణలో గానీ, వ్యవ సాయ భూమి వద్ద గానీ నిర్మించు కునే వెసులుబాటు కల్పించారు.
జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు :
వ్యవసాయ రంగానికి చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ చివరివరకు కొనసాగకపోవడంతో ఈ పథకాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నాయి. సహజ ఎరువు తయారీని ప్రోత్స హించి రైతులకు పెట్టుబడిని తగ్గించడానికి తీసుకొచ్చిన ‘వర్మీ/ నాడెప్ కంపోస్టు పిట్స్’ నిర్మాణం ముందుకు సాగడం లేదు. వీటి తయారీపై రైతులకు అవగాహన కల్పించకపోవడం, అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ పథకం కాగితాలకే పరిమితమైంది.
ప్రచారం లేక పురోగతి శూన్యం..
రైతులు ఇంటి ఆవరణలో సహజ ఎరువులు తయారు చేసుకోవడా నికి ఏర్పాటు చేసుకునే నిర్మాణాలకు ప్రభుత్వమే నిధులు సమకూ రుస్తున్నదన్న విషయం రైతులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణం వల్లే ఆయా జిల్లాలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
నిర్మాణాల కోసం నిధులు..
సాధారణంగా రైతులు పశువుల పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. దీన్ని పెరట్లోనో, ఇంటి సమీపంలోనో ఏర్పాటు చేసుకుంటారు. అయి తే దీని చుట్టూ గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఓ పద్ధతి ప్రకారం పెంటను ఎరువుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధు లను మంజూరు చేస్తోంది. అయితే ఈ విషయం రైతులకు తెలీదు.
నిర్మాణాలు అంతంత మాత్రమే..
కంపోస్టు పిట్స్‌ల నిర్మాణాల్లో వరంగల్ రూరల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాకు 10,878 కంపోస్టు పిట్స్ మంజూరైతే 1,224 కంపోస్టు పిట్స్‌ను మాత్రమే నిర్మించారు. ఇక రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాల్లో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. జయశంకర్, వరంగల్ అర్బన్, కొమురం భీం, మహబూబా బాద్, భద్రాద్రి, మేడ్చల్, నిర్మల్, వనపర్తి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద పల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాలు కంపోస్టు పిట్స్ నిర్మాణాల్లో బాగా వెనుకబడి ఉన్నాయి.