శివసేన విజయానికి బ్రేకులు!
శివసేన విజయానికి బ్రేకులు!
Published Tue, Feb 21 2017 5:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు.
అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్‌కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.
మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు.
Advertisement
Advertisement