సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ ఈ నెల 15న పుణే పర్యటనకు రానున్నారు. పుణేలో మహారాష్ట్ర కేసరీ కుస్తీ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఆయన పుణేకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనపై ఎమ్మెన్నెస్ ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే, బ్రిజ్‌భూషణ్ పర్యటనను వ్యతిరేకించబోమని పుణేకు చెందిన ఎమ్మెన్నెస్ నేత వసంత్ మోరే తెలిపారు. బ్రిజ్‌భూషణ్ సింగ్ పుణే పర్యటనపై ఎమ్మెన్నెస్ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు దూకుడు తగ్గించి, మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.
ఠాక్రే పర్యటనపై సవాళ్లు..ప్రతిసవాళ్లు..
రాజ్ ఠాక్రే ఈ ఏడాది జూన్ ఐదో తేదీన అయోధ్య పర్యటనకు వెళతానని, అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రకటించగానే.. ఆయనను అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని బ్రిజ్‌భూషణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజ్ ఠాక్రే అయోధ్యకు రావాలనుకుంటే అప్పట్లో రైల్వే ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముంబై వచి్చన ఉత్తరభారతీయులపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే అడుగుపెట్టాలని బ్రిజ్‌భూషణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో రాజ్‌ఠాక్రే అయోధ్యకు వస్తే విమానాశ్రయంలో, రైల్వే స్టేషన్‌లో, రోడ్డు మార్గంలో ఇలా ఎక్కడైనా సరే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
దీంతో అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. రాజ్ ఠాక్రేను వ్యతిరేకించినప్పటికీ జూన్‌లో ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలు కొందరు అయోధ్య వెళ్లి రామున్ని దర్శించుకున్నారు. తాజాగా బ్రిజ్‌భూషణ్‌సింగ్ పుణే పర్యటనతో గత పదేళ్లు సద్దుమణిగిన ఉత్తరభారతీయుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ముంబైలో ఎమ్మెన్నెస్– ఉత్తరభారతీయు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. బ్రిజ్‌భూషణ్‌సింగ్ విసిరిన సవాలుకు ఎమ్మెన్నెస్ నేతలు అంతే దీటుగా సమాధానమిచ్చారు. ఇక అప్పట్నుంచి ఎమ్మెన్నెస్ నేతలు, బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
చిచ్చుపెట్టేందుకే బ్రిజ్ పర్యటన!
ఎమ్మెన్నెస్‌కు బ్రిజ్‌భూషణ్ మధ్య చిచ్చుపెట్టేందుకే బ్రిజ్‌భూషణ్ పుణె పర్యటనకు వస్తున్నారని, ఇందులో ఎన్సీపీ నేత శరద్‌పవార్ హస్తం కూడా ఉండొచ్చని అనుమానం ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సింగ్ మేక లాంటి వారు. పులిని వేటాడేందుకు మేకను ఎరవేసినట్లు పవార్ మా మధ్య చిచ్చు పెట్టేందుకు సింగ్‌ను పుణేకు ఆహ్వానించి ఉండొచ్చు’’అని దేశ్‌పాండే ఆరోపించారు.
విభేదాలు తాత్కాలికమే: బ్రిజ్‌భూషణ్
తనకు రాజ్‌ఠాక్రేకు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని, అప్పట్లో ఉన్న విభేదాలు తాత్కాలికమేనని బ్రిజ్‌భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. 15న రాజ్ ఠాక్రే పుణేలో ఉంటే, ఆయన తనను కలిసేందుకు ఇష్టపూర్వకంగా ఉంటే తప్పకుండా ఆయనను కలిసి వెళ్తానని చెప్పారు.
ఎవరీ బ్రిజ్‌భూషణ్ సింగ్
బ్రిజ్‌భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1991లో గోండా లోక్‌సభ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థిపై 1.31 లక్షల ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. అంతేగాకుండా భారతీయ కుస్తీగీర్ సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయోధ్యలో వివాదస్పద కట్టడాన్ని కూల్చిన ఘటనలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వాని సహా 40 మందిపై నమోదైన కేసులో బ్రిజ్‌భూషణ్ సింగ్ ఒకరు. 2020 సెప్టెంబరు 30న వెలువడిన తీర్పులో సింగ్‌ను నిర్ధోషిగా గుర్తించిన కోర్టు విడుదల చేసింది. కుస్తీ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సింగ్ అందరికీ సుపరిచితులే కావడంతో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment