సాక్షి, ముంబై: ‘ఛట్ పూజ’ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లలో ఈ అంశం పెద్దగా తెరపైకి రానప్పటికీ త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. ఉత్తర భారతీయులు, ముఖ్యంగా బీహారీ ప్రజలు జరుపుకునే పండుగల్లో ఒకటైన ఈ ‘ఛట్‌పూజ’ను ఓవైపు మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ మాత్రం ఛట్‌పూజకు అనుకూలంగా ఉంది. శివసేన కొంతకాలంగా ఈ అంశంపై పెద్దగా స్పందించకపోయినా, ఎన్నికల నేపథ్యంలో దీనిపై ఒక అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. బాల్‌ఠాక్రే కూడా చట్‌పూజను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ నేపథ్యంలో పూజ జరుగనున్న పలు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతవరణం నెలకొందని చెప్పవచ్చు. మరో ఐదారు నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తర భారతీయుల ఓటర్లతోపాటు మరాఠీ ఓటర్లనూ ఆకట్టుకునేందుకు ఛట్‌పూజ రాజకీయ పార్టీలకు ఎంతో ఉపయోగపడనుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గత కొన్నేళ్లుగా ఛట్ పూజను ముంబైలో నిర్వహిస్తున్నప్పటికీ దానిని ఎమ్మెన్నెస్ వ్యతిరేకిస్తోంది. ఈసారి కూడా మరాఠీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మునుపటి వైఖరినే కొనసాగించనుందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఉత్తర భారతీయులను ఆకట్టుకునేందుకు ఛట్‌పూజ శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్‌లు నెలకొల్పింది. అయితే ఈ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ఛట్‌పూజను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు సన్నిహితుడిగా గుర్తింపుపొందిన బీజేపీ ముంబైశాఖ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పూజపై ఒక నిర్దుష్ట అభిప్రాయం తెలియజేయకపోవచ్చని సమాచారం. బీహారీలు ముంబైలో తమ బలప్రదర్శన నిర్వహించేదుకే ఈ పూజను నిర్వహిస్తున్నారని రాజ్‌ఠాక్రే ఆరోపించడం తెలిసిందే.
పూజకు ముస్తాబయిన జుహూచౌపాటీ...
ఛట్‌పూజలు నిర్వహించేందుకు జుహూచౌపాటీ ముస్తాబయింది. బీహారీ సమాఖ్య పూజకోసం అన్ని ఏర్పాట్లూ చేసింది. జుహూ చౌపాటీలో శుక్రవారం జరగనున్న ఈ పూజ సందర్భంగా భజన, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలియజేశారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
శక్తి కాదు... భక్తి ప్రదర్శన
ఛట్‌పూజను కొందరు కావాలనే శక్తి ప్రదర్శనగా పేర్కొంటున్నారని, ఇది భక్తి ప్రదర్శన మాత్రమేనని ‘బీహారీ సమాఖ్య’ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. ముంబైలో గత 14 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పూజలో లక్షలాది మంది బీహారీలు పాల్గొంటారని తెలిపారు.
ఎమ్మెన్నెస్ వైఖరిపైనే అందరి దృష్టి...
ఛట్‌పూజపై ఎమ్మెన్నెస్ ఎలాంటి వైఖరిని అవలంభిస్తోందనే విషయంపై అందరి దృష్టి కేంద్రీకతమైంది. పూజకు తాము వ్యతిరేకులం కాదని పేర్కొన్నప్పటికీ, రాజకీయ బలప్రదర్శన చేస్తే మాత్రం ఊరుకునేది లేదని గతంలో రాజ్‌ఠాక్రే హెచ్చరించారు. ఈసారి ఆయన ఎటువంటి వైఖరి తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఎమ్మెన్నెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఛట్ పూజనుఎప్పటిలాగే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
సూర్యుడికి మొక్కులు
ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సక ల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. తదనంతరం గృహిణులు జల్లెడ నుంచి చంద్రుణ్ని వీక్షించిన తరువాత భర్తను చూస్తారు. దీనివల్ల తన భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడని విశ్వసిస్తారు. భర్త కూడా ఈ పర్వదినం నాడు భార్యకు కానుకలు అందజేస్తాడు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఇది నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు.
ఛట్‌పూజపై రాజకీయం
Published Fri, Nov 8 2013 2:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement