
నేను చెప్పిందేంటి.. మీరు రాసిందేంటి..?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే... మరాఠీ విలేకరులపై మండిపడ్డారు. తానొకటి చెబితే విలేకరులు మరోటిరాశారని మీడియాపై చిందులువేశారు. హిందీ విలేకరుల విషయం పక్కనబెట్టినా మరాఠీ మీడియా ఇలా చేస్తుందని అనుకోలేదని, తన వ్యాఖ్యలు అర్థం చేసుకుంటుందని భావించానన్నారు. కాని మరాఠీ విలేకరులలో ‘ఫుల్ ప్యాంటులో ఆఫ్ ప్యాంటు’ కన్పిస్తోందంటూ.. బీజేపీకి మరాఠీ మీడియా మొకరిల్లిందని పరోక్షంగా ఆరోపించారు.
బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కు
అక్రమ కట్టడాలు నిర్మించిన బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించి విక్రయించిన బిల్డర్లపై చర్యలు తీసుకోకుండా ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా ఉన్న అక్రమ కట్టడాలను కొన్ని శరతులపై క్రమబద్ధీకరిస్తామని శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తొందర్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేసిన ఫడ్నవీస్ శరతులపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై, థానే, దివాతోపాటు పుణే, పింప్రి-చించ్‌వడ్, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలకు లాభం కలగనుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఠాక్రే తీవ్రంగా స్పందించారు. కేవలం బిల్డర్లకు లాభం చేకూర్చడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అక్రమ కట్టడాలు నిర్మించి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమకట్టడాలను క్రమబద్దీకరణ చేపట్టడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వెనక్కి తీసుకోలేదు..
రాష్ట్రేతరులకు అందించే ఆటో పర్మిట్లపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదని రాజ్ స్పష్టం చేశారు. ఆటో అందోళన ఎంఎన్‌ఎస్ విరమిస్తున్నట్లు శనివారం వార్తలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. అలాంటిదేమీలేదని, పర్మిట్లు ఇంకా పంపిణీ చేయకపోవడంతో తాత్కాలికంగా ఆందోళన నిలిపేశామన్నారు. తమ పేరుతో ఇతరులు ఆందోళన చే యకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.