పార్టీ ప్రక్షాళన దిశగా రాజ్‌ఠాక్రే
ఎన్నికల ఫలితాల ప్రభావం
సాక్షి, ముంబై: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పార్టీలో భారీగా మార్పులుచేర్పులు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతర్గత విభేదాలే పరాజయానికి ప్రధాన కారణమంటూ రాజ్‌కు అనేక ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో భారీ మార్పులుచేర్పులు చేపట్టి త్వరలో జరగనున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికలకు పార్టీని బలోపేతం చే యాలని రాజ్ యోచిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతో నిరుత్సాహానికి గురైన కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించేందుకు తాను కూడా పోటీ చేస్తానంటూ శాసన సభ ఎన్నికలకు ముందు ప్రకటించారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబీకులెవరూ ఎన్నికల బరిలో దిగలేదని, అందువల్ల తాను కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ ప్రకటించారు. దీంతో కార్యకర్తలు మళ్లీ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే అప్పటికే పార్టీలో అంతర్గత కలహాలు అప్పటికే హద్దులు దాటాయి. ఈ నేనపథ్యంలో పార్టీలో పనిచేయాలా? లేక అంతర్గత వివాదాలను పరిష్కరించుకోవాలా? అనే విషయంలో కొందరు నాయకులు ఎటూ తేల్చుకోలేకపోయారు.
మరోవైపు దాదర్ ప్రాంతంలో ఎమ్మెన్నెస్‌కు ఆరుగురు కార్పొరేటర్లు ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యాడు. దీంతో ఆ పార్టీలో అంతర్గత వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక శాతం మంది అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని రాజ్ యోచిస్తున్నారు. ఇందులోభాగంగా పార్టీలో భారీగా మార్పులుచేర్పులు చేయాలనే సంకల్పంతో ఉన్నారు.