సాక్షి, ముంబై: లోకసభ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రముఖ పార్టీలన్నీ ఎన్నికలు ప్రచారం ప్రారంభించగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఉగాది నుంచి ప్రచారాన్ని ప్రారంభించనుంది. మార్చి 31వ తేదీ సోమవారం నుంచి లాంఛనంగా ప్రచారం ప్రారంభిస్తున్నా ప్రత్యక్షంగా మాత్రం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగా మార్చి 31వ తేదీ పుణే జిల్లా కార్లేలోని ఏక్‌వీరా దేవి మాతాను దర్శించుకోనున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ పుణే జిల్లా జున్నర్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. శంకరపూరాలో జరగనున్న బహిరంగ సభలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి అశోక్ ఖండెభరాడ్ కోసం ప్రచారం చేస్తారు. అనంతరం ఏప్రిల్ రెండున డోంబివలిలో, మూడవ తేదీ ముంబై గోరేగావ్, నాలుగవ తేదీ నవీ ముంబై, అయిద న నాసిక్, ఆరున పుణే, ఏడవ తేదీన యావత్మాల్‌లో తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. గత లోకసభ ఎన్నికల్లో 13 మందిని బరిలోకి దింపిన ఎమ్మెన్నెస్ ఈసారి కేవలం 10 మందిని బరిలోకి దింపింది. దీంతో ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని స్థానిక నేతలు ప్రచారాలు ప్రారంభించారు.
ప్రచార రథాలు సిద్ధం...
ఎన్నికల ప్రచారాల కోసం అందరి మాదిరిగానే ఎమ్మెన్నెస్ కూడా ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. బీజేపీ కమలంతో రథాన్ని రూపొందించుకోగా కాంగ్రెస్ చేతిగుర్తుతో ఉన్న రథాన్ని రూపొందించుకుంది. ఎమ్మెన్నెస్ కూడా తన పార్టీ గుర్తు అయిన రైలు ఇంజిన్‌తో అనేక ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అనేక రథాలు సిద్ధమైనప్పటికీ చివరి విడతలో కానున్న ఠాణే, ముంబై లాంటి ప్రాంతాల కోసం ఇంకా ప్రచార రథాలు సిద్ధం చేస్తూనే ఉన్నారు.
కూతకు ‘రైలింజన్’ సిద్ధం
Published Sat, Mar 29 2014 11:20 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement