సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ నుంచి వలసల పరంపర కొనసాగతూనే ఉంది. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న ముంబై వర్సిటీలోని విద్యార్థి సేనలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అంతర్గత కలహాలు, లుకలుకలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థి సేనలో చీలికలు, పార్టీ ఫిరాయింపులు ఖాయమని స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎమ్మెన్నెస్‌లో ఫిరాయింపులు మొదలయ్యాయి. వాటిని నివారించేందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టినా కొన్ని రోజుల తర్వాత దాన్ని నిలిపివేశారు.
కాగా, ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా ముంబై వర్సిటీకి చెందిన విద్యార్థి సేన నాయకులు సైతం వలస బాట పట్టినట్లు తెలుస్తోంది. తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే రాజ్ ఠాక్రే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సేన నాయకులు అంటున్నారు. యూనివర్సిటికీ కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా పావులు కదడం లాంటి విషయాలపై రాజ్ ఠాక్రే ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏ విషయంలోనూ తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఇలా అన్ని విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలూ విడిచిపెట్టి పోతుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు.
ఎమ్మెన్నెస్ నుంచి తగ్గని వలసలు
Published Sat, Dec 27 2014 10:14 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement