సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల రాజ్‌ఠాక్రే నివాసం కృష్ణకుంజ్‌లో ఎమ్మెన్నెస్ నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమితో చేతులు కలపాలా?, ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశంపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు అధిక మంది నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో 48 లోక్‌సభ సీట్లున్నాయి. బీజేపీ 26, శివసేన కోటాలో ఉన్న 22 సీట్లలో నుంచి ఆర్‌పీఐ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించనుంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెన్నెస్ మహకూటమిలోకి చేరితే ఎమ్మెన్నెస్‌కు సీట్లు చాలా తక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాజ్ ఠాక్రే మధ్య ఉన్న స్నేహసంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విధాల చర్చించినట్టు తెలిసింది. అయితే ఒంటరిగా పోటీ చేసేందుకే అందరు మొగ్గు చూపారు. కొన్ని స్థానాల్లో మాత్రం వారితో సమన్వయం చేసుకుని పోటీ చేయాలని ఎమ్మెన్నెస్ నాయకులు సూచించారు. ఈ సమావేశంలో బాలానందగావ్కర్, ప్రవీణ్ దరేకర్, నితిన్ సర్‌దేశాయి, శిశీర్ శిందే తదితర ప్రముఖులతోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు పాల్గొన్నారు. అనంతరం బాలానందగావ్కర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలపై రాజ్‌ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
అందరి దృష్టి రాజ్ ఠాక్రే వైపు...
రాబోయే లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే మరెవరితోనైనా జతకడుతుందా? అన్న అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కీలకపాత్ర పోషించనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో రాజ్ ఎటువైపు అడుగులు వేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆ పార్టీ నాయకులతో రాజ్‌ఠాక్రే సమావేశమవడం, భవిష్యత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం చకచక జరిగిపోయాయి. అయితే మహాకూటమిలో చేరతామా? లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్న దానిపై రాజ్‌ఠాక్రే స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయనే దానిపై అందరిలో ఉత్కంఠత కన్పిస్తోంది.
చివరి వరకు బీజేపీ ప్రయత్నం...
మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునేందుకు బీజేపీ చివరివరకు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్రంలో అధిక స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇటీవలే మిత్రపక్షమైన శివసేన, ఆర్‌పీఐలు లేకుండానే ఒంటరిగా ముంబైలో మహాగర్జన పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు విశేష స్పందన లభించిన విషయం విదితమే. దీంతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న నరేంద్ర మోడీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెన్నెస్‌ను కూడా చేర్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలుంటాయని బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన మాత్రం ఎమ్మెన్నెస్ విషయంలో సుముఖంగా కన్పించడం లేదు. గతంలో శివసేన ఒక అడుగు ముందుకు వేసినా, అనంతరం జరిగిన పరిణామాల వల్ల వెనక్కి తగ్గింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెన్నెస్ చేర్చుకునే ప్రసక్తేలేదని శివసేన నేత సంజయ్ రావుత్ అన్నారు. అయినా బీజేపీ మాత్రం ఇంకా ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై చివరి వరకు ప్రయత్నించాలని భావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెన్నెస్ దృష్టి
Published Mon, Jan 6 2014 11:01 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement