సాక్షి, ముంబై: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రజల దృష్టినాకర్షిం చేందుకు రకరకాలు ఆందోళనలకు దిగుతున్నాయి. కాగా టోల్ రుసుం చెల్లించొద్దంటూ మహారాష్ర్ట నవనిర్మాణ సేన నేత రాజ్‌ఠాక్రే ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ఉద్య మాన్ని ఉధృతం చేస్తూ బుధవారం రాష్ర్టవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించారు. కాగా, దీనిపై చర్చించేందుకు రాజ్‌ఠాక్రేను సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆహ్వానించడంతో నాలుగు గంటల్లోనే ఎమ్మెన్నెస్ తన ఆందోళనను విరమించింది. దీనిపై మిగిలిన రాజకీయ పక్షాలు విరుచుకుపడ్డాయి. రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెన్నెస్ ఈ రాస్తారోకోకు దిగిందని బీజేపీ, శివసేన ఆరోపించాయి. కాంగ్రెస్, ఎమ్మెన్నెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ ఆందోళనకు దిగిందని ఎమ్మెన్నెస్‌ను దుయ్యబట్టాయి.
వారిది ‘విఫల’యత్నం: ఉద్ధవ్‌ఠాక్రే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేపట్టిన టోల్ ఆందోళనపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెన్నెస్ బుధవారం చేసిన ఆందోళన రాష్ట్ర చరిత్రలో ఘోరంగా విఫలమైన ఆందోళనగా ఆయన అభివర్ణించారు. ఎమ్మెన్నెస్‌ను ప్రజలు క్షమించాలని, ఎందుకంటే వారు కొత్త వారని రాజ్ ఠాక్రేకు చురకలంటించారు. సామ్నా దినపత్రిక శుక్రవారం సంపాదకీయంలో ఎమ్మెన్నెస్ ఆందోళనపై తనదైన శైలిలో ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ‘నయా హై వహ్ !’ (వారు కొత్తవారు) అన్న శీర్షికతో రాసిన ఆ సంపాదకీయంలో ప్రముఖంగా ఆందోళన పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
‘ప్రజాసామ్యదేశంలో ఆందోళనలు చేసే హక్కు అందరికీ ఉంది. ఆందోళన కారణంగా మొత్తం జనజీవనం స్తంభించి పోయింది.. వాహనాలు నిలిచిపోయాయన్న భావన ఆందోళన చేసిన వారిలో ఉండటం సహజం.. కాని నిన్నటి ఆందోళనలో అలాంటి వాతావరణం కనిపించిందా’అని ప్రశ్నించారు. ‘దీనిపై మాట్లాడేందుకు ప్రజలకూ హక్కుంది.. మాట్లాడేవారి నోళ్లు ఎలా మూయగలమ’న్నారు. ‘కొల్హాపూర్‌లో టోల్‌కు వ్యతిరేకంగా శివసేన చేసిన ఆందోళన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై కదలికవచ్చింది.
ఆ తర్వాతే ఎమ్మెన్నెస్, ఎన్సీపీలు మేల్కొన్నాయి.. ఇలా అందరూ ఈ విషయమై ఆందోళనలు మొదలుపెట్టారు.. మహాకూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం టోల్ మాఫీ చేస్తామని ప్రకటించిన తర్వాతనే అనేక మంది నిద్రనుంచి మేల్కొని ఆందోళనలకు దిగార’ని పిస్తోందన్నారు. ఈ ఆందోళన.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను ప్రమోట్ చేసేందుకు ఎమ్మెన్నెస్ చేసిన స్టంట్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. శివసైనికులు ఇటీవలే ఆందోళనలు చేసి జైలుకు వెళ్లి నాలుగు రోజుల తర్వాత గర్వంగా బయటికి వచ్చారన్నారు. కాని బుధవారం నాడు ఎమ్మెన్నెస్ రాస్తారోకో పేరిట డ్రామా నడిపించిందని విమర్శించారు.
టోల్ విషయమై మీ స్పందనేంటి: హైకోర్టు
ముంబై: టోల్ ఆందోళన నేపథ్యంలో ముంబై-పుణే హైవేపై టోల్ రుసుం విధానంపై కేంద్రాన్ని, ఎంఎస్‌ఆర్డీసీ, ఎన్‌హెచ్‌ఏఐలను శుక్రవారం బాంబే హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 17వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల టోల్ విధానంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, నాలుగు లేన్ల జాతీయ రహదారిపై 2008లో ఈ టోల్‌గేట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. టోల్ ప్లాజాల వద్ద మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు ట్రక్ బే, బస్ బేలను ఏర్పాటుచేయాలని, వాహనాల రాకపోకల రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్దేశించారు. కాగా, టోల్ ప్లాజాల వద్ద మిగిలిన సదుపాయాలేవీ కల్పించకుండానే టోల్‌రుసుం వసూలు చేస్తున్నారని కక్షిదారులు ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్, ఆర్టీఐ కార్యకర్త సంజయ్ షిరోద్కర్ కోర్టులో విన్నవించారు.
ముంబై-పుణే హైవే కొత్త రోడ్డు పనులు పూర్తికాకున్నా టోల్ రుసుం వసూలు చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని వారు వాదించారు. దీనికి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎస్‌ఆర్డీసీ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎన్‌హెచ్ 4 పనులు పూర్తయినంతవరకు టోల్ రుసుం వసూలును నిలిపివేయాలని వారు కోర్టుకు విన్నవించారు. దీంతోపాటు టోల్‌గేట్ల వద్ద రోడ్డుకు ఇరువైపులా అంబులెన్సులు ఏర్పాటుచేయాలని యాజమాన్యాలను ఆదేశించాలని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
స్కూల్ బస్సులకు టోల్ మినహాయించాలి
సాక్షి, ముంబై: స్కూల్ బస్సులకు టోల్ నుంచి మినహాయింపునివ్వాలని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. టోల్ వసూళ్లపై నూతన విధానాన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సామాన్యుడిపై చార్జీల భారం పడకుండా బెస్ట్, ఎమ్మెస్సార్టీసీ బస్సులను టోల్ రుసుం నుంచి మినహాయింపునిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరహాలో విద్యార్థులను చేరవేసే స్కూల్ బస్సులకు కూడా టోల్ రద్దు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు అనీల్ గర్గ్ విజ్ఞప్తి చేశారు.
ఠాణేలో అనేక పాఠశాలలు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నాయి. పాఠశాలకు రాకపోకలు సాగించాలంటే వీరు టోల్ కట్టాల్సిందే. దీంతో బస్సు యజమానులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అసోసియేషన్ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ, బెస్ట్ బస్సుల్లాగే స్కూల్ బస్సులకు కూడా టోల్‌నుంచి మినహాయింపునివ్వాలని గర్గ్ డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే: ఎంపీ కామత్
ముంబై: టోల్ విధానాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిసి రాజ్‌ఠాక్రే తెరమీదకు వచ్చారని కాంగ్రెస్ ఎంపీ గురుదాస్ కామత్ ఆరోపించారు. టోల్ విధానాన్ని మారిస్తే అది తన విజయంగా చెప్పుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాజ్‌ఠాక్రే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టోల్ విధానాన్ని మార్చాలని తమ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందన్నారు. ఆప్ పార్టీ తమకు సమవుజ్జీ కాదని, ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆ పార్టీని తక్కువ అంచనా వేయడంతోనే ఎన్నికల్లో గెలిచిందని చెప్పారు.
టోల్..‘గోల్’!
Published Fri, Feb 14 2014 11:01 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement