CM prithviraj chavan
-
టోల్..‘గోల్’!
సాక్షి, ముంబై: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రజల దృష్టినాకర్షిం చేందుకు రకరకాలు ఆందోళనలకు దిగుతున్నాయి. కాగా టోల్ రుసుం చెల్లించొద్దంటూ మహారాష్ర్ట నవనిర్మాణ సేన నేత రాజ్‌ఠాక్రే ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ఉద్య మాన్ని ఉధృతం చేస్తూ బుధవారం రాష్ర్టవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించారు. కాగా, దీనిపై చర్చించేందుకు రాజ్‌ఠాక్రేను సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆహ్వానించడంతో నాలుగు గంటల్లోనే ఎమ్మెన్నెస్ తన ఆందోళనను విరమించింది. దీనిపై మిగిలిన రాజకీయ పక్షాలు విరుచుకుపడ్డాయి. రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెన్నెస్ ఈ రాస్తారోకోకు దిగిందని బీజేపీ, శివసేన ఆరోపించాయి. కాంగ్రెస్, ఎమ్మెన్నెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ ఆందోళనకు దిగిందని ఎమ్మెన్నెస్‌ను దుయ్యబట్టాయి. వారిది ‘విఫల’యత్నం: ఉద్ధవ్‌ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేపట్టిన టోల్ ఆందోళనపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెన్నెస్ బుధవారం చేసిన ఆందోళన రాష్ట్ర చరిత్రలో ఘోరంగా విఫలమైన ఆందోళనగా ఆయన అభివర్ణించారు. ఎమ్మెన్నెస్‌ను ప్రజలు క్షమించాలని, ఎందుకంటే వారు కొత్త వారని రాజ్ ఠాక్రేకు చురకలంటించారు. సామ్నా దినపత్రిక శుక్రవారం సంపాదకీయంలో ఎమ్మెన్నెస్ ఆందోళనపై తనదైన శైలిలో ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ‘నయా హై వహ్ !’ (వారు కొత్తవారు) అన్న శీర్షికతో రాసిన ఆ సంపాదకీయంలో ప్రముఖంగా ఆందోళన పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజాసామ్యదేశంలో ఆందోళనలు చేసే హక్కు అందరికీ ఉంది. ఆందోళన కారణంగా మొత్తం జనజీవనం స్తంభించి పోయింది.. వాహనాలు నిలిచిపోయాయన్న భావన ఆందోళన చేసిన వారిలో ఉండటం సహజం.. కాని నిన్నటి ఆందోళనలో అలాంటి వాతావరణం కనిపించిందా’అని ప్రశ్నించారు. ‘దీనిపై మాట్లాడేందుకు ప్రజలకూ హక్కుంది.. మాట్లాడేవారి నోళ్లు ఎలా మూయగలమ’న్నారు. ‘కొల్హాపూర్‌లో టోల్‌కు వ్యతిరేకంగా శివసేన చేసిన ఆందోళన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై కదలికవచ్చింది. ఆ తర్వాతే ఎమ్మెన్నెస్, ఎన్సీపీలు మేల్కొన్నాయి.. ఇలా అందరూ ఈ విషయమై ఆందోళనలు మొదలుపెట్టారు.. మహాకూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం టోల్ మాఫీ చేస్తామని ప్రకటించిన తర్వాతనే అనేక మంది నిద్రనుంచి మేల్కొని ఆందోళనలకు దిగార’ని పిస్తోందన్నారు. ఈ ఆందోళన.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను ప్రమోట్ చేసేందుకు ఎమ్మెన్నెస్ చేసిన స్టంట్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. శివసైనికులు ఇటీవలే ఆందోళనలు చేసి జైలుకు వెళ్లి నాలుగు రోజుల తర్వాత గర్వంగా బయటికి వచ్చారన్నారు. కాని బుధవారం నాడు ఎమ్మెన్నెస్ రాస్తారోకో పేరిట డ్రామా నడిపించిందని విమర్శించారు. టోల్ విషయమై మీ స్పందనేంటి: హైకోర్టు ముంబై: టోల్ ఆందోళన నేపథ్యంలో ముంబై-పుణే హైవేపై టోల్ రుసుం విధానంపై కేంద్రాన్ని, ఎంఎస్ఆర్డీసీ, ఎన్హెచ్ఏఐలను శుక్రవారం బాంబే హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 17వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల టోల్ విధానంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, నాలుగు లేన్ల జాతీయ రహదారిపై 2008లో ఈ టోల్గేట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. టోల్ ప్లాజాల వద్ద మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు ట్రక్ బే, బస్ బేలను ఏర్పాటుచేయాలని, వాహనాల రాకపోకల రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్దేశించారు. కాగా, టోల్ ప్లాజాల వద్ద మిగిలిన సదుపాయాలేవీ కల్పించకుండానే టోల్‌రుసుం వసూలు చేస్తున్నారని కక్షిదారులు ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్, ఆర్టీఐ కార్యకర్త సంజయ్ షిరోద్కర్ కోర్టులో విన్నవించారు. ముంబై-పుణే హైవే కొత్త రోడ్డు పనులు పూర్తికాకున్నా టోల్ రుసుం వసూలు చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని వారు వాదించారు. దీనికి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎస్ఆర్డీసీ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎన్‌హెచ్ 4 పనులు పూర్తయినంతవరకు టోల్ రుసుం వసూలును నిలిపివేయాలని వారు కోర్టుకు విన్నవించారు. దీంతోపాటు టోల్గేట్ల వద్ద రోడ్డుకు ఇరువైపులా అంబులెన్సులు ఏర్పాటుచేయాలని యాజమాన్యాలను ఆదేశించాలని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. స్కూల్ బస్సులకు టోల్ మినహాయించాలి సాక్షి, ముంబై: స్కూల్ బస్సులకు టోల్ నుంచి మినహాయింపునివ్వాలని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. టోల్ వసూళ్లపై నూతన విధానాన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సామాన్యుడిపై చార్జీల భారం పడకుండా బెస్ట్, ఎమ్మెస్సార్టీసీ బస్సులను టోల్ రుసుం నుంచి మినహాయింపునిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరహాలో విద్యార్థులను చేరవేసే స్కూల్ బస్సులకు కూడా టోల్ రద్దు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు అనీల్ గర్గ్ విజ్ఞప్తి చేశారు. ఠాణేలో అనేక పాఠశాలలు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నాయి. పాఠశాలకు రాకపోకలు సాగించాలంటే వీరు టోల్ కట్టాల్సిందే. దీంతో బస్సు యజమానులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అసోసియేషన్ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ, బెస్ట్ బస్సుల్లాగే స్కూల్ బస్సులకు కూడా టోల్నుంచి మినహాయింపునివ్వాలని గర్గ్ డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే: ఎంపీ కామత్ ముంబై: టోల్ విధానాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిసి రాజ్‌ఠాక్రే తెరమీదకు వచ్చారని కాంగ్రెస్ ఎంపీ గురుదాస్ కామత్ ఆరోపించారు. టోల్ విధానాన్ని మారిస్తే అది తన విజయంగా చెప్పుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాజ్‌ఠాక్రే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టోల్ విధానాన్ని మార్చాలని తమ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందన్నారు. ఆప్ పార్టీ తమకు సమవుజ్జీ కాదని, ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆ పార్టీని తక్కువ అంచనా వేయడంతోనే ఎన్నికల్లో గెలిచిందని చెప్పారు. -
పకడ్బందీ విచారణ
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం కేసును పకడ్బందీగా విచారించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ‘అవును, న్యాయ విధానంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే కేసు దారి తప్పకుండా పకడ్బందీగా విచారించేలా చర్యలు తీసుకుంటామ’ని ఆయన మంత్రాలయలో బుధవారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని శిక్షిస్తామని, ఇతరులకు గట్టి సంకేతాలు పంపేలా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌తో సంప్రదింపుల తర్వాత ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అత్యాచారానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు అందడం లేదన్నారు. ఈ అత్యాచార కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను, అసలు సూత్రదారుల పేర్లను త్వరలోనే బయటపెడతామన్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతుందన్నారు. అయితే రూపాయి విలువ పతనంతో కుదేలవుతున్న పరిశ్రమలను ప్రగతి బాట పట్టించేందుకు కేంద్రం ప్రత్యేక ఉద్దీపనం ప్రకటించొచ్చని అన్నారు. పరి శ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
మిల్లు కార్మికులకు ఇళ్ల వరాలు
సాక్షి, ముంబై: నగరంలోని 12 మిల్లుల స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరిన మిల్లు కార్మికులపై సీఎం వరాల జల్లు కురిపించారు. ఖాళీగా ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెమ్మార్డీయే)కి చెందిన ఇళ్లలో కూడా 50 శాతం ఇళ్లను కార్మికులకే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం కార్మిక నాయకులు, మిల్లు కార్మికుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చవాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు... 1.42 లక్షల మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, గత సంవత్సరం మాడా నిర్వహించిన లాటరీలో ఇల్లు వచ్చిన కార్మిలకు వెంటనే అందజేసే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన మిల్లు స్థలాల్లో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎంను కోరారు. వారి డిమాండ్లను విన్న చవాన్ సానుకూలంగా స్పందించారు. 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై మాడాతో చర్చలు జరుపుతామని, ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెమ్మార్డీయే ఇళ్లలో కూడా సగం ఇళ్లను కార్మికులకే ఇస్తామన్నారు. వీటిని నిర్మించి ఇవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.? అనే విషయమై ఎమ్మెమ్మార్డీయే అధికారులతో కూడా చర్చిస్తానన్నారు. 50 శాతం ఇళ్లు ఇవ్వడానికి నియమ, నిబంధనాల్లో ఎమైనా మార్పులు చేయాల్సి వస్తే నెల రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. బాంబే డయింగ్ మిల్లు స్థలం లభిస్తే అందులో కార్మికుల కోసం ఐదువేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశముంటుందని, ఈ స్థలం ప్రభుత్వ అధీనంలోకి వచ్చేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకు చట్టపరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన 12 మిల్లు స్థలాల్లో 300 చదరపుటడుగుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలపై మిల్లు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమ కల సాకారమ వుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. -
ఆజ్యం పోసిన ‘ఐక్యత రాగం’
సాక్షి, ముంబై: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై వేర్పాటువాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఆయన ప్రసంగంలో వినిపించిన ‘ఐక్యతారాగం’పై రాజకీయ విశ్లేషకులనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, అందుకు మహారాష్ట్ర నిదర్శనమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను రాజకీయ పండితులు తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాజుకున్న విభజన చిచ్చు సెగలు ఇప్పటికే రాష్ట్రాన్ని తాకాయి. ఇక్కడా ప్రత్యేక విదర్భ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన ఐక్యతపై వ్యాఖ్యలు చేయడం ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టడమే అవుతుందంటున్నారు. సీఎం స్థానంలో ఉన్న ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో విభజన చిచ్చు ఓవైపు రాజుకుంటుంటే మరోవైపు తమ రాష్ట్రం సమైక్యంగా ఉందని చెప్పుకోవడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రచయిత్రి శోభా డే చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోశాయని, అనంతరం ముఖ్యమంత్రి పలు వేదికలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళనకారులను మేల్కొల్పాయని, సాధ్యమైనంతవరకు విభజన, సమైక్యమనే మాటలను ఉపయోగించకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలంటున్నారు. ఉధృతమవుతున్న ఉద్యమం... పంద్రాగస్టునాడు కూడా విదర్భ ప్రాంతంలో ప్రత్యేక గళం వినిపించింది. ఉత్సవాలనే వేదికలుగా చేసుకొని కొందరు ప్రత్యేక వాదాన్ని వినిపించగా మరికొందరు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. కాగా ముఖ్యమంత్రి ప్రసంగంలో బహిరంగంగానే సమైక్యతావాదం వినిపించడంతో ఆందోళనకారులు తమ జోరును మరింతగా పెంచారు. తాజాగా శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ప్రతిపక్షాల సమైక్యవాదమే కాపాడుతోంది... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, ఎమ్మెన్నెస్‌లు సమైక్యవాదానికే కట్టుబడడం ప్రత్యేక ఉద్యమానికి కొంత ప్రతికూలంగా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి చేసిన సమైక్యవాదాన్ని తిప్పికొట్టే వేదికేది కూడా రాష్ట్రంలో లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే ఎన్సీపీ ఇప్పటికే ప్రత్యేక విదర్భకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించగా బీజేపీ కూడా అటువైపే మొగ్గుచూపుతోంది. ఒకవేళ కాంగ్రెస్, ఎన్సీపీల మైత్రి చెదిరితే ఎన్సీపీ ఈ అంశాన్నే అస్త్రంగా మలచుకొని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే అవకాశముందని చెబుతున్నారు. శివసేనతో బీజేపీ పొత్తులో ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ కూడా ప్రత్యేక వాదంతో దూసుకుపోయే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం ఇలా ఉన్నా ఎన్నికలు సమీపంచేసరికి రాజకీయ పార్టీల వైఖరి మారుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నడుచుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
సీఎం, పీసీసీ అధ్యక్షుడి మధ్య విభేదాలు!
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైతే సీనియర్ మంత్రులను బరిలోకి దింపుతామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రకటనతో ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే విభేదించారు. వారిని లోక్‌సభ స్థానాలకు బరిలోకి దింపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ మాటలను బట్టి వీరి మధ్య సమన్వయం లేకపోవడంతోపాటు విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య అంతర్గత కలహాల కారణంగా కోల్డ్ వార్ సాగుతుందన్న వార్తలు పలుమార్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రతిసారీ వీరు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యాఖ్యలు, పరిణామాలను చూస్తే విభేదాలున్నాయని తెలుస్తోంది.తాజాగా కేంద్రంలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పట్టున్న రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయమై సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ లోక్‌సభ స్థానాలను మరిన్ని పెంచుకునేందుకు సీనియర్ మంత్రులను బరిలోకి దింపేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. దీంతో అనేకమంది మంత్రులు ఈసారి లోకసభకు వెళ్లనున్నట్టు అందరూ భావించారు. అయితే మాణిక్‌రావ్ ఠాక్రే మాత్రం ఈ విషయంపై మరోలా స్పందించారు. సీనియర్ మంత్రులను బరిలోకి దింపాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే అనేక మంది గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు తమ పార్టీలోనే ఉన్నారని ఆయన చెప్పారు. -
లోకసభ ఎన్నికలకు సిద్ధం
సాక్షి, ముంబై: లోకసభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా పాల్గొంటారని సమాచారం. వీరందరితో ఆయన లోకసభ ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాలే అయినా పలు విభేదాలున్నాయి. సమయం వచ్చిన ప్రతిసారీ ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ పొత్తుతోనే పోటీ చేయనున్నప్పటికీ, ఎన్సీపీ బలాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ ప్రారంభించింది. క్రితం ఎన్నికల కంటే ఈసారి అధిక స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మునుపెన్నడులేని విధంగా చాలా ముందుగానే కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలను మొదలుపెట్టింది. -
వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ చిప్‌లు
టోల్‌నాకాల వద్ద రుసుములు వసూలు చేసే ప్రక్రియను మరింత వేగవంతమయ్యేలా చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టోల్‌నాకాల వద్ద వాహనాల కదలికలను గమనించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాన్ని (ఆర్ఎఫ్ఐడీ) అమర్చుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇటీవల అంధేరీ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ పరికరం అమర్చడం ద్వారా కలిగే లాభాలను కూడా వివరించారు. ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చిన వాహనాల వేగాన్ని దూరం నుంచే నియంత్రించవచ్చన్నారు. ఓవర్ లోడింగ్‌ను కూడా నివారించవచ్చన్నారు. ఆర్ఎఫ్ఐడీలో వాహనాలకు సంబంధించిన మొత్తం వివరాలను పొందుపర్చుతారు. ఈ పరికరం అమర్చడంతో వాహనాల కదలికలను కూడా కంప్యూటర్లో గమనించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.వాహనాలకు ఈ పరికరం రీచార్జ్కార్డు వంటిదని, టోల్‌నాకా మీదుగా వాహనం వెళ్లగానే టోల్సెస్ మొత్తం అందులో నుంచి తగ్గి నాకా ఆపరేటర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో బ్యాలెన్స్ అయిపోగానే రీచార్జ్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్ఎఫ్ఐడీని స్టికర్ మాదిరిగా వాహనానికి ముందు భాగంలో ఉన్న అద్దానికి అంటిస్తారు. ఇది ఒక చిప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని పేరు, ఫిట్నెస్ వివరాలు, పీయూసీ సర్టిఫికెట్‌తోపాటు రవాణా చేస్తున్న వస్తువుల పన్ను చెల్లింపు వివరాలను కూడా ఇందులో ఉంటాయి. ఈ పరికరం ట్రక్కులు, ట్యాంకర్ల వంటి భారీ వాహనాలకు బాగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. అంతేగాకుండా 22 ఆటోమేటిక్ సరిహద్దు చెక్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇందులో నాలుగు చెక్ పోస్టులను ఇది వరకే ప్రారంభించామనీ, మరో నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనీ వివరించారు. మిగతా చెక్‌పోస్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ స్టిక్కర్లను అంటించడానికి ఠాణే ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి కొంత మేర తగ్గనుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.