సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైతే సీనియర్ మంత్రులను బరిలోకి దింపుతామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రకటనతో ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే విభేదించారు. వారిని లోక్‌సభ స్థానాలకు బరిలోకి దింపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ మాటలను బట్టి వీరి మధ్య సమన్వయం లేకపోవడంతోపాటు విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేల మధ్య అంతర్గత కలహాల కారణంగా కోల్డ్ వార్ సాగుతుందన్న వార్తలు పలుమార్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రతిసారీ వీరు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యాఖ్యలు, పరిణామాలను చూస్తే విభేదాలున్నాయని తెలుస్తోంది.తాజాగా కేంద్రంలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పట్టున్న రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ విషయమై సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ లోక్‌సభ స్థానాలను మరిన్ని పెంచుకునేందుకు సీనియర్ మంత్రులను బరిలోకి దింపేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. దీంతో అనేకమంది మంత్రులు ఈసారి లోకసభకు వెళ్లనున్నట్టు అందరూ భావించారు. అయితే మాణిక్‌రావ్ ఠాక్రే మాత్రం ఈ విషయంపై మరోలా స్పందించారు. సీనియర్ మంత్రులను బరిలోకి దింపాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే అనేక మంది గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు తమ పార్టీలోనే ఉన్నారని ఆయన చెప్పారు.
సీఎం, పీసీసీ అధ్యక్షుడి మధ్య విభేదాలు!
Published Wed, Aug 14 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement