సాక్షి, ముంబై: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై వేర్పాటువాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఆయన ప్రసంగంలో వినిపించిన ‘ఐక్యతారాగం’పై రాజకీయ విశ్లేషకులనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, అందుకు మహారాష్ట్ర నిదర్శనమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను రాజకీయ పండితులు తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాజుకున్న విభజన చిచ్చు సెగలు ఇప్పటికే రాష్ట్రాన్ని తాకాయి. ఇక్కడా ప్రత్యేక విదర్భ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన ఐక్యతపై వ్యాఖ్యలు చేయడం ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టడమే అవుతుందంటున్నారు. సీఎం స్థానంలో ఉన్న ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో విభజన చిచ్చు ఓవైపు రాజుకుంటుంటే మరోవైపు తమ రాష్ట్రం సమైక్యంగా ఉందని చెప్పుకోవడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రచయిత్రి శోభా డే చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోశాయని, అనంతరం ముఖ్యమంత్రి పలు వేదికలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళనకారులను మేల్కొల్పాయని, సాధ్యమైనంతవరకు విభజన, సమైక్యమనే మాటలను ఉపయోగించకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలంటున్నారు.
ఉధృతమవుతున్న ఉద్యమం...
పంద్రాగస్టునాడు కూడా విదర్భ ప్రాంతంలో ప్రత్యేక గళం వినిపించింది. ఉత్సవాలనే వేదికలుగా చేసుకొని కొందరు ప్రత్యేక వాదాన్ని వినిపించగా మరికొందరు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. కాగా ముఖ్యమంత్రి ప్రసంగంలో బహిరంగంగానే సమైక్యతావాదం వినిపించడంతో ఆందోళనకారులు తమ జోరును మరింతగా పెంచారు. తాజాగా శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి.
ప్రతిపక్షాల సమైక్యవాదమే కాపాడుతోంది...
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, ఎమ్మెన్నెస్‌లు సమైక్యవాదానికే కట్టుబడడం ప్రత్యేక ఉద్యమానికి కొంత ప్రతికూలంగా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి చేసిన సమైక్యవాదాన్ని తిప్పికొట్టే వేదికేది కూడా రాష్ట్రంలో లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే ఎన్సీపీ ఇప్పటికే ప్రత్యేక విదర్భకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించగా బీజేపీ కూడా అటువైపే మొగ్గుచూపుతోంది.
ఒకవేళ కాంగ్రెస్, ఎన్సీపీల మైత్రి చెదిరితే ఎన్సీపీ ఈ అంశాన్నే అస్త్రంగా మలచుకొని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే అవకాశముందని చెబుతున్నారు. శివసేనతో బీజేపీ పొత్తులో ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ కూడా ప్రత్యేక వాదంతో దూసుకుపోయే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం ఇలా ఉన్నా ఎన్నికలు సమీపంచేసరికి రాజకీయ పార్టీల వైఖరి మారుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నడుచుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
ఆజ్యం పోసిన ‘ఐక్యత రాగం’
Published Fri, Aug 16 2013 10:34 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement