నాగపూర్: విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ శుక్రవారం నిరవధిక దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా అంతర్భాగంగా ఉన్న తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఆయన ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్...నగరంలోని పశ్చిమ ప్రాంతంలోగల సివిల్ లైన్స్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు ఆశిష్... దళిత నాయకుడు, మాజీ మంత్రి సులేఖ కుంభారేతో కలసి రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్‌కు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న తన మద్దతుదారులు, విదర్భవాదులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందువల్ల ప్రత్యేక విదర్భ సాధన కోసం ఉద్యమించాల్సిన తరుణమిదేనన్నారు.
ఇదిలాఉంచితే మరోరెండు రోజుల్లో నగరంలో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశిష్ ... ప్రత్యేక విదర్భ సాధన కోసం నిరాహార దీక్షకు దిగడం గమనార్హం. పత్తి పంట ప్రధానంగా పండే తూర్పు మహారాష్ర్టలోని 12 జిల్లాలతోకూడిన ప్రత్యేక విదర్భ సాధన కోసం అనేక సంవత్సరాలనుంచి ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా విదర్భవాదానికి కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీలు మద్దతు పలుకుతుండగా రాష్ట్ర విభజన అంశాన్ని ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
9న విదర్భ బంద్
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఉద్యమం నానాటికీ ఉధృతమవుతోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదించిన నేపథ్యంలో విదర్భవాదులు తమ లక్ష్యసాధన దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇందులోభాగంగా సోమవారం స్థానిక నాయకులు విదర్భ బంద్‌కు పిలుపునిచ్చారు. జాంబవంత్‌రావ్ ధోటే, బ్రిగేడియర్ సుధీర్ సావంత్‌ల నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు సోమవారం నుంచి నిరవధిక ధర్నాలు, ఆందోళనలు చేపడతారని స్థానిక నాయకుడు ప్రఫుల్ పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ విదర్భ ప్రాంతంలోని సాగునీటి ప్రాజె క్టులను సకాలంలో పూర్తిచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా సుమారు 32 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. విదర్భ ప్రాంత వికాసానికి మంజూరైన రూ.1,300 కోట్లు నిధులను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించిందని, స్థానికులను మోసగించిందని ఆరోపించారు. రాష్టానికి వచ్చే మొత్తం ఆదాయంలో 28 శాతం నిధులు ఈ ప్రాంతానికే దక్కాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగకాశాల్లో 25 శాతం విదర్భ యువకులకు ఇవ్వాల్సి ఉందని, అయితే కేవలం పది శాతం మాత్రమే దక్కుతున్నాయన్నారు. మౌలానా ఆజాద్ ఆర్థికాభివృద్థి మండలి నిధులు ఈ ప్రాంతానికి చెందిన ముస్లింలకు అందడం లేదన్నారు. దీంతో ఉన్నతవిద్యాభ్యాసం చేసిన ముస్లిం యువకులు ఉపాధి కోసం ఇప్పటికీ రాష్ట్ర రాజధానితోపాటు ఇతర నగరాలకు వలస వెళుతున్నారన్నారు. వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలంటే ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని పాటిల్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలను దోచుకుంటున్న నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ సంపూర్ణ విదర్భ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన వివరించారు.
విదర్భకు ఊపు
Published Fri, Dec 6 2013 10:57 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement