Ashish Deshmukh
-
మహారాష్ట్రలో బీజేపీకి షాక్
ముంబై: మహారాష్ట్రలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. విదర్భ ప్రాంతానికి చెందిన కాటోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశిష్ దేశ్‌ముఖ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రత్యేక విదర్భ విషయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అవలంభిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఆశిష్ ప్రత్యేక విదర్భ కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఫడ్నవిస్‌కు సన్నిహితుడిగా పేరొందిన ఆశిష్ ఈ నిర్ణయం తీసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆషిశ్ మాట్లాడుతూ.. ఫడ్నవీస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఫడ్నవీస్ సీఎం అయినప్పుడు చాలా సంతోషించామని తెలిపారు. విదర్బ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరం ప్రభుత్వం తమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆశించామని.. కానీ ఫడ్నవిస్ ప్రభుత్వం విదర్భకు ప్రత్యేంగా ఏమి చేయలేదని విమర్శించారు. గత నాలుగేళ్లలో రైతుల కోసం, యువత కోసం ప్రభుత్వం ఏమి చేయలేదని మండిపడ్డారు. బీజేపీ కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం వార్ధాకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో సమావేశమైన ఆషిశ్ కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. -
ఆరోరోజుకు చేరిన 'ప్రత్యేక విదర్భ' దీక్ష
నాగపూర్: ప్రత్యేక విదర్భ డిమాండ్‌తో యువ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఆరవ రోజుకు చేరింది. అతడిని బుధవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు అనిల్ బోండే, రవి రాణా, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆష్వాద్ తదితరులు పరామర్శించి తమ మద్దతు ప్రకటించారు. వారితో పాటు మాజీ ఎంపీ బన్వర్‌లాల్ పురోహిత్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్క్యూ జామా, ఉపేంద్ర షిండే, అశోక్ ధవడ్ సైతం ఆశిష్‌ను పరామర్శించవారిలో ఉన్నారు. ప్రత్యేక విదర్భను కోరుతూ ప్రజల్లో చైతన్య కలిగించేందుకు సెప్టెంబర్ నెలలో మార్చ్ నిర్వహించి దేశ్ ముఖ్ మరో ముందడుగు వేసి డిసెంబర్ 6వ తేదీన ఆమరణ దీక్షకు పూనుకున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక విదర్భ కోసం డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని ఆశిష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. -
విదర్భకు ఊపు
నాగపూర్: విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ శుక్రవారం నిరవధిక దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా అంతర్భాగంగా ఉన్న తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఆయన ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్...నగరంలోని పశ్చిమ ప్రాంతంలోగల సివిల్ లైన్స్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు ఆశిష్... దళిత నాయకుడు, మాజీ మంత్రి సులేఖ కుంభారేతో కలసి రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్‌కు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న తన మద్దతుదారులు, విదర్భవాదులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందువల్ల ప్రత్యేక విదర్భ సాధన కోసం ఉద్యమించాల్సిన తరుణమిదేనన్నారు. ఇదిలాఉంచితే మరోరెండు రోజుల్లో నగరంలో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశిష్ ... ప్రత్యేక విదర్భ సాధన కోసం నిరాహార దీక్షకు దిగడం గమనార్హం. పత్తి పంట ప్రధానంగా పండే తూర్పు మహారాష్ర్టలోని 12 జిల్లాలతోకూడిన ప్రత్యేక విదర్భ సాధన కోసం అనేక సంవత్సరాలనుంచి ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా విదర్భవాదానికి కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీలు మద్దతు పలుకుతుండగా రాష్ట్ర విభజన అంశాన్ని ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 9న విదర్భ బంద్ సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఉద్యమం నానాటికీ ఉధృతమవుతోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదించిన నేపథ్యంలో విదర్భవాదులు తమ లక్ష్యసాధన దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇందులోభాగంగా సోమవారం స్థానిక నాయకులు విదర్భ బంద్‌కు పిలుపునిచ్చారు. జాంబవంత్రావ్ ధోటే, బ్రిగేడియర్ సుధీర్ సావంత్‌ల నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు సోమవారం నుంచి నిరవధిక ధర్నాలు, ఆందోళనలు చేపడతారని స్థానిక నాయకుడు ప్రఫుల్ పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ విదర్భ ప్రాంతంలోని సాగునీటి ప్రాజె క్టులను సకాలంలో పూర్తిచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా సుమారు 32 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. విదర్భ ప్రాంత వికాసానికి మంజూరైన రూ.1,300 కోట్లు నిధులను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించిందని, స్థానికులను మోసగించిందని ఆరోపించారు. రాష్టానికి వచ్చే మొత్తం ఆదాయంలో 28 శాతం నిధులు ఈ ప్రాంతానికే దక్కాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగకాశాల్లో 25 శాతం విదర్భ యువకులకు ఇవ్వాల్సి ఉందని, అయితే కేవలం పది శాతం మాత్రమే దక్కుతున్నాయన్నారు. మౌలానా ఆజాద్ ఆర్థికాభివృద్థి మండలి నిధులు ఈ ప్రాంతానికి చెందిన ముస్లింలకు అందడం లేదన్నారు. దీంతో ఉన్నతవిద్యాభ్యాసం చేసిన ముస్లిం యువకులు ఉపాధి కోసం ఇప్పటికీ రాష్ట్ర రాజధానితోపాటు ఇతర నగరాలకు వలస వెళుతున్నారన్నారు. వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలంటే ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని పాటిల్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలను దోచుకుంటున్న నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ సంపూర్ణ విదర్భ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన వివరించారు. -
మళ్లీ కాక
నాగపూర్: శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. విదర్భవాదులంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరసనలకు దిగనున్నారు. ఇందులోభాగంగా యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ వచ్చే నెల ఆరో తేదీనుంచి నిరాహార దీక్షకు దిగనుండగా, విదర్భ సంయుక్త కార్యాచరణ కమిటీ (వీజాక్) మాక్ ఐదు, ఆరు తేదీల్లో అసెంబ్లీ నిర్వహించనుంది. దీంతోపాటు శాసనసభ సమావేశాల ప్రారంభం కానున్న తొలిరోజే బంద్ నిర్వహించాలని స్థానిక నాయకుడు జాంబువంత్‌రావ్ ధోతే నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు వివిధ పార్టీలు నిర్ణయించాయి. వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే నిరసనలు, కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని విదర్భకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశానికి ప్రజల మద్దతు ఏస్థాయిలో ఉందనే విషయాన్ని ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి. కాగా పట్టణంలోని సంవిధాన్ స్క్వేర్ ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాలని భావించిన ఆశిష్ దేశ్‌ముఖ్... అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలోని భాస్కర్ భవన్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తాను తలపెటి నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాలు మద్దతు పలికేందుకు సుముఖత వ్యక్తం చేశాయని ఆశిష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇదిలాఉండగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెరపైకి రావాలని ప్రత్యేక విదర్భవాదులు భావిస్తున్నారు. మూడే ళ్ల క్రితం వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఇందుకోసం తీవ్ర కృషి చేశారు. ప్రత్యేక విదర్భవాదానికి బీజేపీతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐలకు చెందిన నాయకులు కూడా అప్పట్లో మద్దతు పలికిన సంగతి విదితమే. ఉద్యమానికి ఊపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్... ప్రత్యేక విదర్భకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో పట్టణంలోని షాహిద్ చౌక్ నుంచి సేవాగ్రామ్‌దాకా పాదయాత్ర నిర్వహించారు. గాంధీ జయంతినాడు ఆ యాత్ర ముగిసింది. యువత సహకారంతోవచ్చే నెల ఆరో తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షతో ఈ ఉద్యమం ఇంకా బలపడేందుకు తోడ్పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి రెఫరెండంతో స్ఫూర్తి గతంలో అమరావతి పట్టణంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు అనూహ్య స్పందన లభించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలంటూ 85 శాతం మంది ప్రజలు ఓటేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న విదర్భవాదులు నాగపూర్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. జన్‌మంచ్ అనే పౌర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వచ్చే నెల మూడో వారంలో పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సదరు సంస్థ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన శరద్‌పాటిల్, చంద్రకాంత్ వాంఖడేలు శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఆ రోజున పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతా ల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. భాగస్వాములు కండి ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని విదర్భ వికాస్ పరిషత్ వ్యవస్థాపకుడు, ఎంపీ దత్తా మేఘే ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘తెలంగాణతో పాటు విదర్భను ఏర్పాటు చేయాలి’
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు విదర్భ సంయుక్త కార్యాచరణ సంఘం సమన్వయకర్త, యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పుడూ సాధించుకోలేం. తెలంగాణతోపాటు విదర్భ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేకుంటే భవిష్యత్‌లో ఎన్నడూ మన కల సాకారమయ్యే అవకాశం లేదు’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు కూడా అయిన ఆశిష్ అన్నారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు చేయాలని 1956లోనే సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విదర్భకు మద్దతు కోసం సేకరించిన వేలాది వినతిపత్రాలు, లేఖలను ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 21న సోనియాగాంధీ నాగపూర్‌లో పర్యటిస్తున్నప్పడు ఎంపీ వాటిని ఆమెకు అందజేస్తారని ఆశిష్ వివరించారు.