ముంబై: మహారాష్ట్రలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. విదర్భ ప్రాంతానికి చెందిన కాటోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశిష్ దేశ్‌ముఖ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రత్యేక విదర్భ విషయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అవలంభిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఆశిష్ ప్రత్యేక విదర్భ కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఫడ్నవిస్‌కు సన్నిహితుడిగా పేరొందిన ఆశిష్ ఈ నిర్ణయం తీసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఆషిశ్ మాట్లాడుతూ.. ఫడ్నవీస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఫడ్నవీస్ సీఎం అయినప్పుడు చాలా సంతోషించామని తెలిపారు. విదర్బ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరం ప్రభుత్వం తమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆశించామని.. కానీ ఫడ్నవిస్ ప్రభుత్వం విదర్భకు ప్రత్యేంగా ఏమి చేయలేదని విమర్శించారు. గత నాలుగేళ్లలో రైతుల కోసం, యువత కోసం ప్రభుత్వం ఏమి చేయలేదని మండిపడ్డారు. బీజేపీ కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం వార్ధాకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలతో సమావేశమైన ఆషిశ్ కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment