మళ్లీ కాక | vidarbha people's protests for a separate state | Sakshi
Sakshi News home page

మళ్లీ కాక

Published Sat, Nov 30 2013 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

vidarbha people's protests for a separate state

నాగపూర్: శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. విదర్భవాదులంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరసనలకు దిగనున్నారు. ఇందులోభాగంగా యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ వచ్చే నెల ఆరో తేదీనుంచి నిరాహార దీక్షకు దిగనుండగా, విదర్భ సంయుక్త కార్యాచరణ కమిటీ (వీజాక్) మాక్ ఐదు, ఆరు తేదీల్లో అసెంబ్లీ నిర్వహించనుంది. దీంతోపాటు శాసనసభ సమావేశాల ప్రారంభం కానున్న తొలిరోజే బంద్ నిర్వహించాలని స్థానిక నాయకుడు జాంబువంత్‌రావ్ ధోతే నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు వివిధ పార్టీలు నిర్ణయించాయి. వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే నిరసనలు, కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని విదర్భకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశానికి ప్రజల మద్దతు ఏస్థాయిలో ఉందనే విషయాన్ని ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి.
 కాగా పట్టణంలోని సంవిధాన్ స్క్వేర్ ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాలని భావించిన ఆశిష్ దేశ్‌ముఖ్... అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆర్‌బీఐ క్వార్టర్స్ సమీపంలోని భాస్కర్ భవన్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తాను తలపెటి నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాలు మద్దతు పలికేందుకు సుముఖత వ్యక్తం చేశాయని ఆశిష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇదిలాఉండగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెరపైకి రావాలని ప్రత్యేక విదర్భవాదులు భావిస్తున్నారు. మూడే ళ్ల క్రితం వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఇందుకోసం తీవ్ర కృషి చేశారు. ప్రత్యేక విదర్భవాదానికి బీజేపీతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్‌పీఐలకు చెందిన నాయకులు కూడా అప్పట్లో మద్దతు పలికిన సంగతి విదితమే.
 ఉద్యమానికి ఊపు
 కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్... ప్రత్యేక విదర్భకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో పట్టణంలోని షాహిద్ చౌక్ నుంచి సేవాగ్రామ్‌దాకా పాదయాత్ర నిర్వహించారు. గాంధీ జయంతినాడు ఆ యాత్ర  ముగిసింది. యువత సహకారంతోవచ్చే నెల ఆరో తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షతో ఈ ఉద్యమం ఇంకా బలపడేందుకు తోడ్పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
 అమరావతి రెఫరెండంతో స్ఫూర్తి
 గతంలో అమరావతి పట్టణంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు అనూహ్య స్పందన లభించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలంటూ 85 శాతం మంది ప్రజలు ఓటేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న విదర్భవాదులు నాగపూర్‌లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. జన్‌మంచ్ అనే పౌర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వచ్చే నెల మూడో వారంలో పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సదరు సంస్థ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయాన్ని  ఆ సంస్థకు చెందిన శరద్‌పాటిల్, చంద్రకాంత్ వాంఖడేలు శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఆ రోజున పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతా ల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు.
 భాగస్వాములు కండి
 ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని విదర్భ వికాస్ పరిషత్ వ్యవస్థాపకుడు, ఎంపీ దత్తా మేఘే ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement