వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం.....
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ఉపాధి హామీ పథకం, నీటి సంరక్షణ శాఖ మంత్రి నితిన్ రావుత్ మంగళవారం స్పష్టీకరించారు. విదర్భ డిమాండ్‌కు రావుత్ బహిరంగంగా మద్దతు తెలపడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు విదర్భకు మద్దతు తెలపడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాగపూర్‌లో మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే విదర్భ అంశాన్ని పక్కన బెట్టడం నిరాశకు గురిచేసింది.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ప్రకటన చేస్తారని నేను భావించాను’ అని నాగపూర్ ఇన్‌చార్జి మంత్రి కూడా అయిన రావుత్ అన్నారు. ప్రత్యేక విదర్భకు అనుకూలమని పేర్కొంటూ భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రం గురించి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతోపాటు ఎనిమిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పుసాద్, అచల్‌పూర్, చిమూర్, అష్టి, బ్రహ్మపురి, అమేరీ, ఖామ్‌గావ్, కటోల్ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే నాగపూర్‌లో భారీ ఎత్తున గొలుసు దొంగతనాలు జరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్నిచర్యలూ తీసుకుంటామని నితిన్ రావుత్ హామీ ఇచ్చారు.