మిల్లు కార్మికులకు ఇళ్ల వరాలు
Published Fri, Aug 16 2013 11:13 PM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
సాక్షి, ముంబై: నగరంలోని 12 మిల్లుల స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరిన మిల్లు కార్మికులపై సీఎం వరాల జల్లు కురిపించారు. ఖాళీగా ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎమ్మెమ్మార్డీయే)కి చెందిన ఇళ్లలో కూడా 50 శాతం ఇళ్లను కార్మికులకే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం కార్మిక నాయకులు, మిల్లు కార్మికుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చవాన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా వారు... 1.42 లక్షల మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, గత సంవత్సరం మాడా నిర్వహించిన లాటరీలో ఇల్లు వచ్చిన కార్మిలకు వెంటనే అందజేసే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన మిల్లు స్థలాల్లో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎంను కోరారు. వారి డిమాండ్లను విన్న చవాన్ సానుకూలంగా స్పందించారు. 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై మాడాతో చర్చలు జరుపుతామని, ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెమ్మార్డీయే ఇళ్లలో కూడా సగం ఇళ్లను కార్మికులకే ఇస్తామన్నారు. వీటిని నిర్మించి ఇవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.? అనే విషయమై ఎమ్మెమ్మార్డీయే అధికారులతో కూడా చర్చిస్తానన్నారు. 50 శాతం ఇళ్లు ఇవ్వడానికి నియమ, నిబంధనాల్లో ఎమైనా మార్పులు చేయాల్సి వస్తే నెల రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు.
బాంబే డయింగ్ మిల్లు స్థలం లభిస్తే అందులో కార్మికుల కోసం ఐదువేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశముంటుందని, ఈ స్థలం ప్రభుత్వ అధీనంలోకి వచ్చేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకు చట్టపరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన 12 మిల్లు స్థలాల్లో 300 చదరపుటడుగుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలపై మిల్లు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమ కల సాకారమ వుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Advertisement