టోల్‌నాకాల వద్ద రుసుములు వసూలు చేసే ప్రక్రియను మరింత వేగవంతమయ్యేలా చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టోల్‌నాకాల వద్ద వాహనాల కదలికలను గమనించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాన్ని (ఆర్‌ఎఫ్‌ఐడీ) అమర్చుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇటీవల అంధేరీ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ పరికరం అమర్చడం ద్వారా కలిగే లాభాలను కూడా వివరించారు. ఆర్‌ఎఫ్‌ఐడీ పరికరాన్ని అమర్చిన వాహనాల వేగాన్ని దూరం నుంచే నియంత్రించవచ్చన్నారు. ఓవర్ లోడింగ్‌ను కూడా నివారించవచ్చన్నారు. ఆర్‌ఎఫ్‌ఐడీలో వాహనాలకు సంబంధించిన మొత్తం వివరాలను పొందుపర్చుతారు. ఈ పరికరం అమర్చడంతో వాహనాల కదలికలను కూడా కంప్యూటర్‌లో గమనించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.వాహనాలకు ఈ పరికరం రీచార్జ్‌కార్డు వంటిదని, టోల్‌నాకా మీదుగా వాహనం వెళ్లగానే టోల్‌సెస్ మొత్తం అందులో నుంచి తగ్గి నాకా ఆపరేటర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో బ్యాలెన్స్ అయిపోగానే రీచార్జ్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్‌ఎఫ్‌ఐడీని స్టికర్ మాదిరిగా వాహనానికి ముందు భాగంలో ఉన్న అద్దానికి అంటిస్తారు. ఇది ఒక చిప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని పేరు, ఫిట్‌నెస్ వివరాలు, పీయూసీ సర్టిఫికెట్‌తోపాటు రవాణా చేస్తున్న వస్తువుల పన్ను చెల్లింపు వివరాలను కూడా ఇందులో ఉంటాయి.
ఈ పరికరం ట్రక్కులు, ట్యాంకర్ల వంటి భారీ వాహనాలకు బాగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. అంతేగాకుండా 22 ఆటోమేటిక్ సరిహద్దు చెక్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇందులో నాలుగు చెక్ పోస్టులను ఇది వరకే ప్రారంభించామనీ, మరో నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనీ వివరించారు. మిగతా చెక్‌పోస్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. వాహనాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ స్టిక్కర్లను అంటించడానికి ఠాణే ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి కొంత మేర తగ్గనుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వాహనాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌లు
Published Mon, Aug 5 2013 11:03 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement