పింప్రి, న్యూస్‌లైన్: విడిపోవడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పుణేలో ఆంధ్రప్రదేశ్ విభజన, రాజకీయ పరిస్థితులపై చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూ హ్య స్పందన లభించింది. డెక్కన్ జింఖానాలోని పుణే ఆంధ్ర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని మేధావులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులే కాకుండా తెలుగు ప్రజలు కూడా హాజరై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే అభిప్రాయం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల వారు విడిపోవడం సబబు కాదని, తెలుగువారిగా ఐక్యంగా ఉండి రాజకీయ కుళ్లును కడిగివేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ నాయకులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతూ అక్కడి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు బాగా నష్టపోయారన్నారు. రాజకీయ ఎత్తుగడలో తెలుగు జాతి యావత్తూ చిత్తయిందని అభిప్రాయపడ్డారు. మరో వక్త మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మంచి చెడులను గ్రహించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మధ్య ఐక్యత లేక పోవడంతో కత్తులు దూసుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలోనే వైఎస్‌ఆర్ ఆకస్మికంగా మృతి చెందారనీ, ఇదే ఆ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తెలుగు జాతిని నిలువునా చీలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ర్టంలో జరుగుతున్న మారణహోమాన్ని చూసి తెలుగుతల్లి రోదిస్తోందన్నారు. అందువల్ల దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అభీష్టం మేరకు ఏర్పడ్డాయని, ఇంత తీవ్రస్థాయిలో గొడవ జరగలేదని ఓ విద్యార్థిని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ఐ.వి.రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్నేహ (ఇంజనీరింగ్ విద్యార్థి), రామారావు, శ్రీనివాస్, ఎస్.డి.రావు, ఎం.సి.కె. రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ విభజనపై చర్చాగోష్టిలో వక్తల మనోభావం
Published Wed, Aug 7 2013 11:01 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement