టోల్‌నాకాల పరిస్థితులపై కంపెనీల ఆందోళన
Published Tue, Aug 6 2013 11:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీలింక్ ప్రాజెక్టు’ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు గతంలో ఆసక్తి కనబర్చిన ఐదారు కంపెనీలు టెండర్ల ప్రక్రియకు మాత్రం దూరంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క సంస్థ కూడా టెండరు వేయకపోవడంతో ప్రాజెక్టు భవిత అగమ్యగోచరంగా మారింది. టెండర్లు వేసేందుకు సోమవారం ఆఖరు రోజు కావడంతో సాయంత్రం గడువు ముగిసే వరకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యూపీఎస్ మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కిలోమీటర్ల మార్గం సముద్రంపైనే ఉంటుంది.
తొలుత ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చిన బడా సంస్థల్లో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, హ్యుందయ్, సింట్రా-సోమా, గ్యామన్ ఇన్‌ఫ్రా- ఓహెచ్‌ఎల్, జీఎంఆర్, ఎల్ అండ్ టీ, శామ్‌సన్, టాటా రియల్టీ, ఆటోస్ట్రెడ్ ఇండియన్ ఇన్‌ఫ్రా, విన్సి వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఐఆర్‌బీ, హ్యుందయ్ కంపెనీలు ఇటీవల కొల్హాపూర్ టోల్‌నాకా వద్ద జరిగిన హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టబడులకు వాతావరణం అనుకూలంగా లేదని కారణం చూపుతూ టెండరు వేయకూడదని గతవారమే నిర్ణయం తీసుకున్నాయి. మిగతా నాలుగు సంస్థలు మాత్రం టెండరు వేయకపోవడానికి గ ల కారణాలను స్పష్టం చేయలేదు. ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్లలో మాంద్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సేకరించే అవకాశాలు తక్కువగా ఉండడం, టోల్ వసూళ్లపై భరోసా లేకపోవడం వంటి వాటి వల్ల కంపెనీలు టెండర్ల దాఖలుకు వెనుకడుగు వేసి ఉండవొచ్చని ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచే అన్ని కంపెనీలతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించక ముందు పలుసార్లు సమావేశాలు జరిగాయి. సీలింక్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఊహించిన విధంగా ఉంటుందా..? టోల్ ద్వారా రాబట్టే డబ్బులతో ఈ ప్రాజెక్టుకు వెచ్చించిన డబ్బులు వసూలవుతాయా..? వంటి అనేక సందేహాలను సదరు సంస్థలు సమావేశంలో వ్యక్తం చేశాయి. కాని ఈ ప్రాజెక్టు నిర్మాణానికిఅవసరమయ్యే వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), అనేక విధాల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు హామీ ఇచ్చామని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ బిడే చెప్పారు.
అయినప్పటికీ ఏ కంపెనీ కూడా టెండరు వేసేందుకు ముందుకు రాలేదని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, అందుకు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టును క్యాష్ ఆన్ కాంట్రాక్టు ప్రతిపాదనపై చేపట్టేందుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తామని, ఆరు నెలల్లో మరోసారి టెండర్లను ఆహ్వానిస్తామని ఆమె చెప్పారు.
Advertisement
Advertisement