సీ ‘లింక్’ కుదిరింది..! | Japanese International Co-operation Agency ready to provide funds for mumbai trans harbour link project | Sakshi
Sakshi News home page

సీ ‘లింక్’ కుదిరింది..!

Published Sat, Jul 19 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

Japanese International Co-operation Agency  ready to provide funds for mumbai trans harbour link project

సాక్షి, ముంబై: ప్రతిపాదిత శివ్డీ-నవశేవా సీ లింక్ (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) ప్రాజెక్టుకు నిధులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జేఐసీఏ) సంకేతాలిచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు ఎదురైన వివిధ కీలక అడ్డంకుల్లో ఒకటి పరిష్కారమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ సీ లింక్ ప్రాజెక్టును జేఐసీఏ ఆర్థిక సంస్థకు చెందిన బృందం ఇటీవల సందర్శించింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై స్వయంగా తామే నివేదిక రూపొందించుకుంటామని పేర్కొంటూనే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు మొత్తం 22 కి.మీ. పొడవుంది.

 ఇందులో 18 కి.మీ. సముద్రంపై ఉండగా మిగతాది రోడ్డు మార్గం. అందుకు రూ.9,630 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) పీపీపీ పద్ధతిలో ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియకు స్పందన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రన్ (ఐపీసీ) పద్ధతిలో చేపట్టాలని ఎమ్మెమ్మార్డీయే యోచిస్తోంది. ఆ మేరకు జేఐసీఏ ద్వారా నిధులు పొందేందుకు ఎమ్మెమ్మార్డీయే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

 దీంతో కేంద్రం జేఐసీఏతో చర్చలు జరిపింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రతిపాదన పంపించింది. దీంతో జేఐసీఏకు చెందిన 10 మంది సభ్యులు ముంబైకి వచ్చి ప్రతిపాదిత ప్రాజె క్టు ప్రాంతంలో పర్యటించారు. ఎమ్మెమ్మార్డీయే రూపొందించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎమ్మెమ్మార్డీయే అందించిన సమాచారంతో ౄటు తాము సొంతంగా అధ్యయనం చేసి నివేదిక రూపొం దించుకుంటామని ఆ బృందం స్పష్టం చేసింది.

 అలాగే, ఎమ్మెమ్మార్డీయే సమర్పించిన ముసాయిదాను పునఃపరిశీలించనున్నట్లు తెలిపింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీకే నిధులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ బృందం సంకేతాలిచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు కొనసాగేందుకు కొంతమేర మార్గం సుగమమైందని ఎమ్మెమ్మార్డీయే భావిస్తోంది. శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు చేపట్టేందుకు గతంలో అనేక్చసార్లు టెండర్లను ఆహ్వానించింది. కాని పెట్టుబడి తిరిగి వస్తుందో..? రాదో.? అనే అనుమానంతో కొన్ని కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది. చివరకు జేఐసీఏ ఆర్థిక సంస్థ తక్కువ వడ్డీకే రుణాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలివ్వడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement