సాక్షి, ముంబై: లోకసభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా పాల్గొంటారని సమాచారం. వీరందరితో ఆయన లోకసభ ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాలే అయినా పలు విభేదాలున్నాయి. సమయం వచ్చిన ప్రతిసారీ ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ పొత్తుతోనే పోటీ చేయనున్నప్పటికీ, ఎన్సీపీ బలాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ ప్రారంభించింది. క్రితం ఎన్నికల కంటే ఈసారి అధిక స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మునుపెన్నడులేని విధంగా చాలా ముందుగానే కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలను మొదలుపెట్టింది.