సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడటం ఇంకా మొదలుపెట్టక ముందే కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం తెలంగాణ భవన్‌లో నల్లగొండ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. ‘అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీ లు గుప్పించారు.
ఇప్పుడు హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలు చెప్పా రు. కార్యకర్తలు ఉదాసీన వైఖరిని వీడాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి’అని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు.
ఓటమిపై అనుమానం రాలేదు
‘నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఎక్కడా ఓటమిపై అనుమానం రాలేదు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. కేవలం సూర్యాపేటలో మాత్రమే గెలిచాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలి. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించింది.
కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయి. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా నిర్వహించాలి’అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని వ్యాఖ్యానించారు.
రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్‌ఎస్‌ను కాలుస్తానని మోదీ అంటున్నారని, మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి వివరించాలన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని, నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు.
కష్టపడ్డ వారికే గుర్తింపు: హరీశ్‌రావు
17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించిన 16 సమావేశాల్లో 112 గంటల పాటు చర్చ జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రో హం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై సూచనలు వచ్చాయని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగుదామని చెప్పారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎండ్రకాయల పార్టీ అని, ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను మరో 20 రోజుల్లో నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్‌ఎస్ పేరిట దేశమంతా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి కాంగ్రెస్‌కు సహకరించారని, రాహుల్‌ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్ట మని భావించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామన్నారు.
‘లోక్‌సభ’కు సన్నద్ధం
♦ సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
♦ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుపు లక్ష్యంగా... అసెంబ్లీ ఎన్నికల్లో
♦ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
♦ జరిగిన పొరపాట్లు పునరావృత కానివ్వమని భరోసా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్‌ల సన్నాహక సమావేశాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్ నింపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలు కావడంతో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవరించింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ జనవరి 3న తెలంగాణభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ సెగ్మెంట్‌తో మొదలైన సమావేశాలు సోమవారం నల్లగొండతో ముగిశాయి.
రోజుకో లోక్‌సభ నియోజకవర్గం చొప్పున 16 రోజులు జరిగిన సమావేశాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్ సమావేశాలు ఒకేరోజు జరిగాయి) దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన 500 నుంచి 800 వరకు వివిధ స్థాయిల్లోని నాయకులు ప్రతిరోజు తెలంగాణభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషిం చారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 9 మంది ఎంపీలు ఉండగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ సన్నాహాక సమావేశాలు జరిగాయి.
ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకు
తొలిరోజే ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి గల కారణాలను నిర్భయంగా పార్టీ అగ్రనేతల సమక్షంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుల పరిస్థితి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు దక్కిన పదవుల గురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారు బీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరడం మొదట్లో బాగున్నా, తర్వాత విభేదాలు పెరిగాయని, ఇవి కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వచ్చాయని పలు నియోజకవర్గాల నాయకులు విశ్లేషిం చారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండు గట్టిగా ఉన్న చోట బీఆర్‌ఎస్ గెలిచిన విషయాలను సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్ సమావేశాల్లో పార్టీ నాయకులు విశ్లేషిం చారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు పోటీ చేసిన చోట్ల బీఆర్‌ఎస్ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, కేశవరావు, మధుసూదనాచారి వంటి సీనియర్లు ఓపిగ్గా వింటూ, అలా మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి పార్టీ యంత్రాంగంలో ధైర్యం నింపారు.
Comments
Please login to add a commentAdd a comment