కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కిందటి నెల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మహాగఠబంధన్ (మహాకూటమి) వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు సాధ్యమయ్యేది కాదని స్పష్టమౌతోంది. ఇటీవల ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీయేతర రాజకీయపార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో సీట్ల సర్దుబాటు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలపాలన్న ప్రతిపాదన మొదట పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ చేయగా, బెంగళూరులో హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణానికి హాజరైన ప్రతిపక్షాల నేతలు దీనికి మద్దతు పలికారు.
అయితే, బీజేపీయేతర పార్టీల మహాకూటమి సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే ఏర్పడుతుందని ఈ పార్టీల నేతల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, కర్ణాటక, ఒడిశా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బడా ప్రాంతీయ పార్టీలే మిగిలిన బీజేపీయేతర పార్టీలకు కొద్దోగొప్పో లోక్‌సభ సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ బలానికి అనుగుణంగా తగినన్ని సీట్లు ఇవ్వకపోతే మిగిలిన పక్షాలు ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుకు అంగీకరించవు. అలాగే, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెసే పెద్ద పార్టీ కావడంతో ఇతర ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదు. కేరళలోని రెండు ప్రధాన కూటము(ఎల్డీఎఫ్, యూడీఎఫ్)ల మధ్య పోరు తప్పదు. బీజేపీ ఈ రాష్ట్రంలో మూడో పక్షంగా మిగిలిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల ఫలితాలు వచ్చాకే చేతులు కలుపుతాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్రాలవారీగా మాత్రమే బీజేపీయేతర పార్టీల మధ్య ఓ మోస్తరు సీట్ల సర్దుబాటుకు అవకాశముంటుంది. ఇదే విషయం పవార్, సూర్జేవాలా చెప్పారు.
మహాకూటమి సాధ్యం కాదన్న పవార్!
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య జాతీయస్థాయిలో పొత్తు ఉండదని, మహాకూటమి ఎన్నికలకు ముందు ఆచరణసాధ్యం కాదని శరద్‌పవార్ ఇటీవల తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ నంబర్‌వన్ ప్రతిపక్ష పార్టీయే సీట్లు కేటాయిస్తుందని ఆయన అన్నారు. పొత్తులు రాష్ట్రాలవారీగా పార్టీల మధ్య కుదురుతాయనీ, అన్ని రాష్ట్రాల్లో అనుసరించడానికి వీలైన ఒకే తరహా పొత్తుల నమూనా ఏదీ ఉండదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ప్రతిపక్షాల మధ్య కుదిరే పొత్తు యూపీలో పనిచేయదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ సహా అనేక మంది ప్రాంతీయపక్షాల నేతలు మహాకూటమికి నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న కారణంగా కాంగ్రెస్ వైఖరి మారిందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి మమత, మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు సిద్ధంగా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తు కాంగ్రెస్‌కు సాధ్యం కాదనీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఈ జాతీయపార్టీ అభిప్రాయపడుతోంది. కుమారస్వామి ప్రమాణానికి బెంగళూరు వచ్చిన పార్టీల నేతలందరూ ఎన్నికల్లో కలిసి పోటీచేయాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. ఈ పార్టీలన్నీ అన్ని రాష్ట్రాల్లో చేతులు కలుపుతాయని ఆశించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుపై కీచులాడుకోకుండా ఫలితాలు వెలవడ్డాకే ఎన్డీఏ మెజారిటీ కోల్పోయేపక్షంలో ప్రతిపక్షాలు చేతులు కలపడం మేలనే అభిప్రాయం అనేక మంది ప్రతిపక్షనేతల్లో బలపడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ మధ్యే పొత్తు?
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకుగాను బీఎస్పీ ఎక్కువ సీట్లకు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అత్యధిక స్థానాలకు పోటీచేసేలా రెండు పార్టీల నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలంలేని, తన ఓట్లు మిత్రపక్షాలకు బదిలీ చేయలేని కాంగ్రెస్‌కు రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని అఖిలేశ్ అన్నారని కూడా వార్తలొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రంగా చెప్పే యూపీలో కనీసం 20 సీట్లకైనా పోటీచేయకపోతే పరువు పోతుందనే భావన కాంగ్రెస్‌లో ఉంది. ఈ లెక్కన ఎస్పీ, బీఎస్పీ మధ్య మాత్రమే సీట్ల సర్దుబాటు కుదురుతుంది.
బిహార్‌లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీయే కాంగ్రెస్ వంటి చిన్న పార్టీలకు సీట్లు ఇచ్చే స్థితిలో ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అవకాశమున్న మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ దాదాపు సమాన బలం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. కర్ణాటకలో కూడా సంకీర్ణ భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ 28 లోక్‌సభ సీట్లను పంచుకుంటాయనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో పాలక ప్రాంతీయపక్షాలైన తృణమూల్, బీజేడీ, ఏఐఏడీఎంకే మిగిలిన మిత్రపక్షాలకు ఎవరికి ఎన్ని సీట్లో నిర్ణయిస్తాయి. తమిళనాట ప్రధానప్రతిపక్షమైన డీఎంకే నాయకత్వాన కాంగ్రెస్ వంటి పార్టీలు కలిసి పోటీచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాలక ప్రాంతీయపక్షాలు బీజేపీకి వ్యతిరేకమని ప్రకటించినా లోక్‌సభ సీట్లు ఇతర చిన్న పార్టీలకు ఎంత వరకు కేటాయిస్తాయో అప్పుడే చెప్పడం కష్టం.
Comments
Please login to add a commentAdd a comment