కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి. శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి కుమ్మక్కయ్యాయని ఎమ్మెన్నెస్ ఆరోపించింది.
సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి. శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి కుమ్మక్కయ్యాయని ఎమ్మెన్నెస్ ఆరోపించింది. ఈ రెండు కూటములు ఉద్దేశపూర్వకంగానే సభలో రభస సృష్టించి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆ పార్టీ నాయకుడు బాలానాంద్‌గావ్కర్ మండిపడ్డారు. నాగపూర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వీరి వైఖరి కారణంగా ప్రజాసమస్యలపై చర్చించాల్సిన విలువైన సమయం వృథా అవుతోంది.
అలాంటప్పుడు శాసనసభ సమావేశాలు నిర్వహించడమెందుకు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులైంది. ఇందులో విలువైన సమయాన్నంతా గందరగోళం సృష్టించడానికే సరిపోయింది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సభ జరుగుతుంది. అది చేయలేకపోవడమంటే ప్రజాప్రతినిధులుగా అంతా విఫలమైనట్లే. ప్రజలకు సంబంధించి అంశాలు చర్చకు రాగానే ప్రతిపక్ష నాయకులు కావాలనే రాద్ధాంతం సృష్టిస్తున్నారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది’ అని ఆరోపించారు. జల్గావ్ పాల డెయిరీ కుంభకోణంపై చర్చ కోసం పట్టుబట్టాల్సిన అవసరమే లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి రాజీనామా కోసం రెండు రోజులు సభా కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పనేముందని నిలదీశారు.
అర్ధంలేని ఆరోపణలు
ఈ ఆరోపణలను శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ఖండించారు. తమ పాత్ర ఏమిటో తమకు తెలుసన్నారు. ప్రజాసమస్యలపై సక్ర మంగానే చర్చలు జరుపుతున్నామన్నారు. అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెన్నెస్ నాయకులను విశ్వాసంలోకి తీసుకుని సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. బాలానంద్‌గావ్కర్ అనవసరంగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఇక నుంచి ఆయనను అడిగిన తరువాతే చర్చలపై నిర్ణయం తీసుకుంటామంటూ ఎద్దేవా చేశారు.