
సినిమా విడుదలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలపై ఇప్పటివరకూ ఉన్న ఎన్నో సందేహాలకు మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు ఎదురవ్వకుండా చూసుకుంటామని పోలీసుశాఖ హామీ ఇచ్చినా కొందరు ఆందోళనకారుల తీరుతో మూవీ యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదలకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఒకవేళ సినిమా విడుదలకు అవాంతరం కలుగజేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని సీఎం తేల్చి చెప్పారు.
మెట్రో సినిమా వద్దకు వెళ్లి 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదల చేయవద్దని హెచ్చరించిన 12 మంది మహారాష్ట్ర నవ నిర్మాణసేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఆందోళనకారులను నవంబర్ 4 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు. 'ఏ దిల్ హై ముష్కిల్' ఈ నెల 28న విడుదల కానుందని మూవీ యూనిట్ ఇదివరకే ప్రకటించింది.
తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కరణ్ జోహర్ కోరారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాల నిడివిలో మాత్రమే మూవీలో కనిపిస్తాడని, అందరూ తమకు సహకరించాలని మరో నిర్మాత విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే.