
ఎందుకంత తొందర
- సల్మాన్‌తో రాజ్ ఠాక్రే, నితేష్ రాణే భేటీని తప్పుపట్టిన శరద్ పవార్
- కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని రాజ్ పరామర్శించారా అని ప్రశ్న
సాక్షి, ముంబై: హిట్ అండ్ రన్ కేసులో దోషి అయిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే, కాంగ్రెస్ యువనాయకుడు నితేష్ రాణే కలవడాన్ని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తప్పుపట్టారు. రాజ్ ఠాక్రే శుక్రవారం మధ్యాహ్నం సల్మాన్ ఇంటికి వెళ్లాడని, ఆయన్ను ఓదార్చడానికి ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబీకులను పరామార్శించేందుకు రాజ్ ఠాక్రే వెళ్లారా అని ప్రశ్నించారు.
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌కు 5 ఏళ్ల శిక్ష పడిన అనంతరం ఒక్కసారిగా ఖాన్ ఇంటో బాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖుల సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో పవార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్ ఠాక్రే ఓ రాజకీయ నాయకుడని, పార్టీ అధ్యక్షుడని, ఓ కేసులో దోషి అయిన వ్యక్తితో రాజ్ భేటీ వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పరోక్షంగా అన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్‌తో నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణే భేటీ కావడంపై కూడా పవార్ విమర్శలు గుప్పించారు.
సల్మాన్‌తో భేటీ అయిన సచిన్ ఆహీర్
ఎన్సీపీ నాయకుడు సచిన్ ఆహీర్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా అయిదేళ్ల శిక్ష పడిన సల్మాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఓ వైపు ఖాన్‌తో భేటీ అయన రాజ్ ఠాక్రే, నితేష్ రాణేలపై ఎన్సీపీ అధ్యక్షుడు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తుంటే.. మరోవైపు ఎన్సీపీ పార్టీ నాయకుడు సల్మాన్ ఖాన్‌తో భేటీ కావడం విశేషం.