ప్రభుత్వం నిర్ణయించాలి.. మీరుకాదు: హీరో
ముంబయి: రెండు రోజుల్లో పాకిస్థాన్ కు చెందిన నటులు, టీవీ ఆర్టిస్టులు భారత దేశాన్ని విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. భారత్ లో ఎవరు పనిచేయాలి? ఎవరు పనిచేయకూడదు? అని చెప్పాల్సింది ఒక్క ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. టాలెంట్ ఉన్నవాళ్లందరికీ భారత చిత్ర పరిశ్రమ స్వాగతం పలుకుతుందని, ఆదరిస్తుందని అన్నారు.
ఇది ఒక్క దేశ సరిహద్దుకే పరిమితం అని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఉగ్రవాదం పై మండిపడుతూ ఆ దేశానికి చెందిన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ తదితర పాక్ నటులంతా భారత్ ను 48గంటల్లో విడిచి వెళ్లాలని లేదంటే ఎలా వెళ్లగొట్టాలో తమకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు.
'కళల సంస్కృతిని మార్చుకోవడం అనేది కచ్చితంగా ప్రోత్సహించాల్సిన విషయం. చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఉన్నవారికి తలుపులు తెరిచి ఉంచుతుంది. ముఖ్యంగా భారత్ తో సరిహద్దు ఉన్న దేశాలకు కూడా. అయితే, ఇలాంటివన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. మేమంతా నటులం.. మేం ప్రేమ, శాంతి గురించి మాట్లాడతాం. చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం చేస్తుంది' అంటూ జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పంపిణీ కార్యక్రమంలో సైఫ్ చెప్పారు.