అదితీ ప్రభుదేవా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్
సూపర్ హీరోల సినిమాలు తరచూ చూస్తూనే ఉంటాం. సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటివి. మన దేశీ సూపర్ హీరోలు శక్తిమాన్, క్రిష్ కూడా ఉన్నారు. కానీ సూపర్ హీరో సినిమాలతో పోల్చు కుంటే సూపర్ హీరోయిన్‌ల సినిమాలు తక్కువ. హాలీవుడ్‌లో వండర్ ఉమెన్, బ్లాక్ విడో, కెప్టెన్ మార్వెల్ సినిమాలు ఉన్నాయి. కానీ భారతీయ చిత్రాల్లో సూపర్ హీరోయిన్ సినిమాలు అసలు రాలేదు. ప్రస్తుతం సూపర్ హీరోయిన్ సినిమాలను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విశేషాలు...
శ్రద్ధ... నాగకన్య
శ్రద్ధా కపూర్ ఓ సినిమాలో నాగకన్యగా నటించనున్నారని తెలిసిందే. మూడు భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమాను ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లా డిజైన్ చేస్తున్నారట చిత్రబృందం. విషాల్ ఫూరియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అవసరమైనప్పుడు నాగకన్యగా మారే శక్తులు శ్రద్ధకపూర్‌కి ఉంటాయని తెలిసింది. మరి సూపర్ హీరోలకు ప్రేక్షకులు ప్రేమను పంచినట్టే సూపర్ హీరోయిన్లను కూడా ఆదరిస్తారా? వేచి చూడాలి.
అదితీ... ఆనా
కన్నడంలో ‘ఆనా’ అనే సూపర్ హీరోయిన్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. అదితీ ప్రభుదేవా లీడ్ రోల్‌లో పి. మనోజ్ దర్శకత్వం వహించారు. ‘తొలి ఫీమేల్ సూపర్ హీరోయిన్ చిత్రం’ ఇదే అని చిత్రబృందం ప్రకటించింది. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా మిగతా భాషల్లోనూ విడుదల కావచ్చు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో మరింత యాక్షన్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.
కత్రినా... ది సూపర్ ఉమన్
‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓ సూపర్ హీరోయిన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ తొలిసారి సూపర్ హీరోయిన్‌గా మారుతున్నారు. ఆల్రెడీ ఇందులో చేయబోయే యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు కత్రినా. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సుమారు నాలుగైదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్టు ప్రకటించారు అలీ అబ్బాస్.
Comments
Please login to add a commentAdd a comment