పాత ఫార్ములాతోనే పోటీ | Prithviraj Chavan is Manmohan Singh without a turban: Raj Thackeray | Sakshi
Sakshi News home page

పాత ఫార్ములాతోనే పోటీ

Published Mon, Feb 10 2014 11:41 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై అవగాహన కుదిరింది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పాత ఫార్ములా ప్రకారం 26, 22 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది.

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై అవగాహన కుదిరింది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పాత ఫార్ములా ప్రకారం 26, 22 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవాను నిలువరించేందుకు పొత్తుతో ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌ల మధ్య అరగంట పాటు చర్చలు జరిగాయి.

 ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏకే ఆంటోని, అహ్మద్ పటేల్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కూడా హాజరయ్యారు. ఎన్సీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్‌రావ్ జాదవ్‌లు పాల్గొన్నారు. అనంతరం ఇరు పార్టీలు పాత ఫార్ములా ప్రకారమే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, సీఎం చవాన్ విలేకరులకు తెలిపారు.

 గత స్థానాల్లోనే పోటీచేయాలనే దానిపై తదుపరి చర్చలు ఉంటాయన్నారు. ఎన్సీపీకి కేటాయించిన కొల్హా పూర్ సీటులో గెలిచిన ఆ పార్టీ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా వ్యవహరిస్తుండటంపై మాట్లాడేందుకు సీఎం చవాన్ నిరాకరించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఇటీవల పటేల్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. అయితే ఎన్సీపీకి 19 స్థానాల్లో కేటాయించాలని అనుకున్న చవాన్, ఠాక్రేలు తుదగా పాత ఫార్ములా ప్రకారమే పోటీ చేయాలని నిర్ణయానికి అంగీకరించారు.

 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. సోనియా గాంధీ విదేశీయురాలని విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించారు. 1999 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నారు. అయితే బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్‌లతో సీట్ల పంపిణీ గురించి చర్చలు కూడా త్వరగా ఓ కొలిక్కివచ్చే అవకాశం కనబడుతోంది.
 రాష్ర్టంలో పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహిక అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సోమవారం పరిశీలించింది. గురువారం నుంచి జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement