శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) మధ్య రహస్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి, ముంబై: శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) మధ్య రహస్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గంలో శివసేన, నాసిక్ లోకసభస్థానంలో ఎమ్మెన్నెస్ గెలుపు కోసం... పరస్పరం సహకరించుకునేందుకు ఒప్పందానికి వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలూ అందకపోయినా, ఓ ప్రముఖ మరాఠీ పత్రిక ఈ విషయంపై ప్రధాన వార్తను ప్రచురించింది. దక్షిణ మధ్య ముంబై లోకసభ నియోజకవర్గం సీటును మనోహర్ జోషికి ఇచ్చేందుకు సేన నిరాకరించిన విషయం విదితమే.
దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఆ స్థానం నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చెర్మైన్ రాహుల్ శేవాలేను బరిలోకి దింపేందుకు సేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సీనియర్ నాయకుడు మనోహర్ జోషిని కాదని రాహుల్ శేవాలేను ఇక్కడి నుంచి బరిలోకి దింపనున్నందున, ఈస్థానం శివసేనకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు మొట్టమొదటిసారిగా నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎమ్మెన్నెస్ అధికారంలోకి వచ్చింది. నాసిక్‌లో ఎమ్మెన్నెస్‌కు మంచి పట్టుఉన్నప్పటికీ అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఊహించినంత అభివృద్ధి చేయలేకపోయింది.
దీంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాసిక్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం కోసం ఎమ్మెన్నెస్ తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో ముంబైలో శివసేనకు తమకు మద్దతు ఇస్తే నాసిక్‌లో ఎమ్మెన్నెస్‌కు సహకారం అందించడానికి సేన అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు రహస్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. శివసేన ఈ విషయంపై చొరవ తీసుకొని ముందడగు వేసిందని తెలిసింది. ఇప్పటికే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులతోపాటు పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోనూ చర్చలు జరిపినట్టు సమాచారం. దక్షిణమధ్య ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్న రాహుల్ శేవాలే స్వయంగా రాజ్‌ఠాక్రేతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలున్నాయి.