సాక్షి, ముంబై: టోల్‌ప్లాజాలపై దాడులు చేసేలా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రేపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈప్రక్రియను ప్రారంభించిన పోలీసులు రాజ్‌ఠాక్రేను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. నవీముంబైలో ఆదివారం రాత్రి రాజ్‌ఠాక్రే చే సిన రెచ్చగొట్టే సీడీ ప్రసంగాలను హోంశాఖ, పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. ఆయనపై ఎప్పుడైనా కేసులు నమోదుచేయవచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
టోల్ చెల్లించొద్దని, ఎవరైన బలవంతం చేస్తే వారిని చితక్కొట్టండని రాజ్‌ఠాక్రే పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై విరుచుకుపడ్డారు. పుణే-సతార రహదారిపై టోల్ ప్లాజాపై రాళ్లు రువ్వడంతో నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు నష్టం వాటిళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాంద్రా-వర్లీ సీలింక్‌పై కూడా దాడులు చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్, టోల్ రసీదులు జారీచేసే యంత్రాలను ధ్వంసంచేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు.
ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజ్‌పై కేసు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచి వసూలు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌ఠాక్రే, ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో అది చేసుకోవచ్చని. తాను ఏం చేయదలుచుకున్నానో అది కచ్చితంగా చేస్తానని ప్రభుత్వానికి సవాలు విసిరారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లపై భారీగా విమర్శలు చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికిముందే రాజ్ ఠాక్రేను అరెస్టు చేసే అవకాశముందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఇదేం టోల్ వసూళ్ల పద్ధతి: బీజేపీ
ముంబై: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టోల్ రుసుం వసూళ్ల విధానంపై బీజేపీ మండిపడింది. వీరి తీరువల్ల భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం విలేకరులతో అన్నారు. డబ్బులు వెచ్చించి కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు టోల్ రూపంలో వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నాయన్నారు.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సీసీటీవీ ఫుటేజీల్లో పరిశీలిస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించడంపై ఫడ్నవిస్ మండిపడ్డారు. ఆయన తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారని, అయితే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. కాగా, ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేదే కాదని బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే అన్నారు.
టోల్ విధానంలో మార్పుండదు: సీఎం
ప్రస్తుతమున్న టోల్ వ్యవస్థ కొనసాగుతుందని రాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. టోల్ రుసుంను నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని అనేక టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రోడ్లను నిర్మించేందు కోసమే ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నామని చవాన్ మీడియాకు తెలిపారు.
ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పేరు ఎత్తకుండానే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు. రోడ్లను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. టోల్ వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
రాజకీయ గిమ్మిక్కే: ఉద్ధవ్
ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టోల్‌రుసుం రూపంలో ఎమ్మెన్నెస్ పార్టీ రాజకీయ డ్రామాలకు తెరలేపిందని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. ఆయనదంతా ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శించారు. కొల్హాపూర్‌లో స్థానికుల సహకారంతో తమ పార్టీ నిర్వహించిన ఆందోళన విజయవంతమైందన్నారు. ముంబై, ఠాణే, పుణే టోల్‌నాకాలపై భారీ విధ్వంసం జరగడంపై మాట్లాడుతూ ఇన్నేళ్లుగా నిద్రపోయిన ఎమ్మెన్నెస్ పార్టీ ఆకస్మాత్తుగా మేలుకోవడాన్ని తాము అర్ధం చేసుకుంటున్నామన్నారు.
ఎన్నికలకు ముందు ఇలా చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఆందోళన రాజుకుందని, డబ్బులు వసూలు చేయడం లేదని రాజ్‌ఠాక్రే గొప్పలు చెబుతున్నారు. ఎక్కడ రాజుకుంది...? రాష్ట్రవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. వాహన యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నార’ని ఉద్ధవ్ ఠాక్రే వ్యంగంగా మాట్లాడారు. టోల్‌ప్లాజాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటివల్ల ఒరిగిందేమి లేదని ఘాటుగా విమర్శించారు.
కేవలం శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలో వస్తే రాష్ట్ర ప్రజలకు తప్పకుండా టోల్ నుంచి విముక్తి లభిస్తుందని హామీ ఇచ్చారు. ఆరు లేన్ల పుణే, ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని, ఆ రహదారిలో టోల్ చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అయితే ఆధ్వాన్న రోడ్లు ఉన్న కొల్హాపూర్, నాసిక్‌లలో ఎందుకు టోల్ రుసుం చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వసూలు చేసిన టోల్ రుసుం వ్యయంలో భారీగా అవినీతి జరుగుతోందన్నారు.
అరెస్టు అనివార్యమేనా!
Published Wed, Jan 29 2014 11:29 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement