రాజ్ చల్తా! | I support Narendra Modi but am against Patel statue: Raj Thackeray, MNS Chief | Sakshi
Sakshi News home page

రాజ్ చల్తా!

Published Sun, Apr 20 2014 11:09 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

I support Narendra Modi but am against Patel statue: Raj Thackeray, MNS Chief

 మాతృ సంస్థ శివసేననుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే 2006లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని స్థాపించారు. భూమిపుత్రులు, మరాఠీయుల హక్కుల కోసం ఉద్యమించారు. ఉత్తర భారతీయులపై విరుచుకపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై అనేక కేసులు నమోదైనా వెరవలేదు. బాల్‌ఠాక్రే మాదిరిగానే పదునైన పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న పది లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడంపై దృష్టి పెట్టారు.
 
 
 ముంబై: శివసేన పార్టీనివీడి రాజ్‌ఠాక్రే ఎనిమిదేళ్ల క్రితం స్థాపించిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తొలిసారిగా పోటీ చేసిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలు దక్కించుకొని ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించింది. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుమారు డజను లోక్‌సభ స్థానాల్లో  బీజేపీ, శివసేన పార్టీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసి పరోక్షంగా అధికార డీఎఫ్ కూటమికి సహకరించింది. మరాఠీ ఓట్లను చీల్చడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, బీజేపీ, శివసేనల తర్వాత ఐదో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2012 మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో 28 స్థానాలు, పుణేలో 29 సీట్లు, కళ్యాణ్-డోంబివలిలో 27 స్థానాలను గెలిచింది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారాన్ని దక్కించుకుంది.

 దీంతో రాజ్‌ఠాక్రే బలాన్ని గుర్తించిన బీజేపీ ఆయనను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 2010 సంవత్సరంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు గుజరాత్‌లో రాజ్‌ఠాక్రే పర్యటించారు. మోడీ పాలన బహుబాగు అని కితాబిచ్చేశారు. 2012లో శివసేన పార్టీ అధినేత బాల్‌ఠాక్రే మరణించిన తర్వాత రాజ్‌ఠాక్రేతో బీజేపీకి మరింత సన్నిహిత్యం పెరిగింది. ఇటీవలే బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఓ హోటల్‌లో రాజ్‌ఠాక్రేతో సమావేశమై కమలం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే స్థానాల్లో పోటీ చేయకూడదని కోరారు.

అందుకు అనుగుణంగానే రాజ్‌ఠాక్రే బీజేపీ స్థానాల్లో కాకుండా, శివసేన పార్టీ బరిలోకి దిగిన స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. ఇది 25 ఏళ్లుగా బీజేపీతో మైత్రి బంధం సాగిస్తున్న శివసేన పార్టీకి అగ్రహానికి గురి చేసింది. ఏకంగా పొత్తును వదిలేసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే హెచ్చరించే స్థాయికి చేరుకుంది. ఇలా బీజేపీ, శివసేనల మధ్య మైత్రిని కాస్త దెబ్బతీయడంలో రాజ్‌ఠాక్రే సఫలీకృతమయ్యారు. ఇప్పటికీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకే తమ మద్దతు ఉంటుందని రాజ్‌ఠాక్రే బాహాటంగానే ప్రకటిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే మోడీ ప్రధాని అయ్యేందుకు తగినంత బలం లేకపోతే, రాష్ట్రఅభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తికే తాము మద్దతును ప్రకటిస్తామని ఎమ్మెన్నెస్ ఉపాధ్యక్షుడు వాఘీశ్ సరస్వత్ అన్నారు. స్వల్పకాలికం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషించే దిశగా పార్టీని ముందుకు నడుపుతామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement