నాసిక్ లో విలేకరులతో మాట్లాడుతున్న రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు గౌరవమని, ఆ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను మనస్ఫూర్తిగా అభినందిస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) రాజ్‌ఠాక్రే గురువారం అన్నారు. అయితే బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేదని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. నాసిక్ కార్పొరేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఠాక్రే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ‘ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి.
కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు’ అని అన్నారు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారని, మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) గురించి మాట్లాడుతూ ఢిల్లీలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌ను గద్దె దింపి అధికారంలోకి రావడం గర్వించదగ్గ విషయమన్నారు. అక్కడి ఫలితాలు కాంగ్రెస్‌తోపాటు ఇతర సంప్రదాయ పార్టీల అసమర్థతను బయటపెట్టాయన్నారు. అవి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయడం లేదని స్పష్టమైందని రాజ్ అన్నారు. ఆప్ ప్రభావం ఢిల్లీ వరకే పరిమితమని, మహరాష్ట్రలో దారి ప్రభావ ం ఉండబోదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మార్పులు మార్పులు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ జిల్లాలు, నగరాల వారీగా పార్టీ సమావేశాల నిర్వహణను గురువారం నుంచి ప్రారంభించామన్నారు. మహాకూటమిలో స్వాభిమాన్ శేత్కరి సంఘటన ఎంపీ రాజు శెట్టి చేరారు. ఇదే తరహాలో ప్రతిపక్షాల ఓట్లు రాబట్టుకునేందుకు ఎమ్మెన్నెస్ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుందా...? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోదని పునరుద్ఘాటించారు. అలాంటి ఉద్దేశం, ప్రతిపాదన ఏవీ లేవన్నారు. ప్రస్తుతం తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిందని, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాల గురించి మాట్లాడుతూ ‘గత 15 ఏళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న ఇరు పార్టీలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు. అవినీతి, భారీ కుంభకోణాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి’ అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని, కాంగ్రెస్,ఎన్సీపీ కూటమికి నూకలు చెల్లినట్లేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధిచెబుతారని రాజ్‌ఠాక్రే అన్నారు.