
'ఇటు రా.. మెడపై కత్తిపెడతా'
ముంబై: 'భారత్ మాతాకీ జై' నినాదంపై చెలరేగుతున్న వివాదానికి మరింత ఆజ్యంపోశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే. 'మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తిపెడతా. 'భారతమాతాకీ జై' అని ఎందుకు అనవో చూస్తా' అంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఒవైసీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో శుక్రవారం రాత్రి జరిగిన ఓ సభలో మాట్టాడిన రాజ్ థాక్రే ఎంఐఎం, బీజేపీ, శివసేనలపై విరుచుకుపడ్డారు. ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించారు. అధికార బీజేపీ కరువు పరిస్థితులపై పట్టనట్లు వ్యవహరిస్తున్నదని, మిత్రపక్షంగా ఉన్న శివసేన వెంటనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని రాజ్ థాక్రే అన్నారు.
దేశభక్తి విషయంలో ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలను పట్టించుకోనని, మెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై నినాదం చేయబోనని అసదుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 'చట్టాలను గౌరవించబట్టే భారత్ మాతాకీ జై అననన్న లక్షల మందిని ఊచకోత కోయట్లేదు'అని యోగా గురు రామ్ దేవ్ అన్నారు. ఇప్పుడు అసద్ ను విమర్శించిన వంతు రాజ్ థాక్రేది.