ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో కీలకమైనది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. దాన్ని బట్టే ఆ పార్టీ గెలుపుపోటములు కూడా ఆధారపడి ఉంటాయి. స్వతంత్రులు సైతం తమను గెలిస్తే చేసే పనులను ప్రకటించి ఓట్లను అభ్యర్థిస్తారు. కానీ, అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికల బరిలో దిగే ఏకైక రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్– ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, వరసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం మాత్రం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు.
ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా.. ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది. ఆరున్నర దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయలేదు. తాజాగా కూడా తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మేనిఫెస్టో లేకుండానే బరిలో దిగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏఐఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా రికార్డుకెక్కింది.
పాతబస్తీ నుంచి దేశస్థాయికి
‘‘మా పనితీరు.. మా గుర్తింపు’’ అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగే ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బిహార్ శాసనసభల్లో సైతం పార్టీ ప్రాతినిధ్యం కలిగి ఉంది. అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలో స్థానిక స్థంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. పార్లమెంటులోనూ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ నుంచి ఇంతీయాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వారంలో ఆరు రోజులు...
ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ప్రజా గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందుబాటులో ఉంటారు. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా కార్పొరేటర్‌నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం కంటే హిందుసామాజిక వర్గం తాకిడి దారుస్సలాంకు అధికంగా ఉండటం విశేషం. అయితే ఇక్కడ అంతా క్యూ పాటించాల్సిందే.
పాతబస్తీలో కింగ్ మేకర్
హైదరాబాద్ రాజకీయాలలో మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తోంది. హైదరాబాద్ పాతనగరం రాజకీయ పరిస్థితికి కొత్త నగరం భిన్నంగా ఉంటుంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్‌సైడ్‌గా ఉంటోంది.
ఇదీ చరిత్ర
96 ఏళ్ల కిందట నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్‌లో 1927లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా ఆవిర్భవించిన ధార్మిక సంస్ధ క్రమంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో చేరిన తర్వాత ఈ సంస్థ నిషేధానికి గురైంది. అసదుద్దీన్ ఒవైసీ తాత అప్పటి ప్రసిద్ధ న్యాయవాది మౌలానా అబ్దుల్ వాహిద్ ఒవైసీ 1958లో రాజ్యాంగంలో పొందుపరిచిన మైనారిటీల హక్కుల కోసం పోరాడేందుకు ఆ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చారు.
1959లోనే హైదరాబాద్‌లో జరిగిన రెండు మున్సిపల్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. 1960లో హైదరాబాద్ బల్డియాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వరసగా అబ్దుల్ వాహెద్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టి ముస్లిం మైనారిటీ గొంతుకగా బలమైన రాజకీయ శక్తిగా మార్చుతూ వచ్చారు.
మభ్యపెట్టడానికే మేనిఫెస్టో
ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి మేనిఫెస్టో ఒక ప్రచారసాధనం. ఓట్లు రాబట్టుకునేందుకు ఒక ఆయుధం. అందుకే మేం ఎన్నడూ ఆ ఊసెత్తం. హామీలు ఇవ్వం. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇలాంటప్పుడు ఇక మేనిఫెస్టో అవసరం ఏముంది. అమలు కాని హామీలిచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మజ్లిస్ పార్టీ పద్ధతి కాదు. – అసదుద్దీన్ ఒవైసీ ,అధినేత, ఏఐఎంఐఎం
- మహమ్మద్ హమీద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment